Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ఎన్నికల కన్నా యూపీలో తగ్గిన సీట్లు
- కొద్దిగా మెరుగుపడిన ఓట్ల శాతం
లక్నో : రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తిరిగి భారతీయ జనతా పార్టీనే అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. 2017 ఎన్నికల్లో తన హిందూత్వ ఎజెండాతోనే విజయం సాధించిన బీజేపీ ఈసారీ అదే కార్డును ఉపయోగించింది. ఎన్నికల ముందు వ్యవసాయ చట్టాలపై ప్రజల్లో రేగిన అసంతృప్తి, లఖింపూర్ ఖెరి పరిణామాలతో బీజేపీకి కొంత భయం పట్టుకున్నా చివరకు కుల, మతోన్మాద పోకడలను రెచ్చగొట్టి, ఆర్థిక, అంగ బలంతో అనుకున్న రీతిలో విజయాన్ని మూటగట్టుకోగలిగింది. కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇస్తున్న ఉచిత రేషన్, కేంద్ర పథకాలను సమర్ధవంతగా అమలు చేసిన తీరు వంటివి ప్రజల్లో బీజేపీ పట్ల కొంత సానుకూలతను కలిగించినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు మంత్రులతో సహా పలువురు నేతలు పార్టీని వీడినా ఆ ప్రభావం అక్కడికే పరిమితమైంది తప్ప ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కానీ, పార్టీపై గానీ పడలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల వాటాను కూడా పెంచుకోగలిగింది. కానీ సీట్లు తగ్గాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 39.7శాతం ఓట్లు రాగా, ఈసారి 42శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తంగా 376 స్థానాల్లో పోటీచేయగా, 252 సీట్లను బీజేపీ గెలుచుకుంది. బీజేపీ కూటమి మొత్తంగా 270స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో భాగస్వామ్య పార్టీలైన ఎడిఎస్కి 11సీట్లు రాగా, ఎన్ఎస్హెచ్డికి ఏడు స్థానాలు వచ్చాయి. ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగినా సీట్లు మాత్రం ఈసారి బీజేపీ కి తగ్గాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ కూటమికి 322 సీట్లురాగా, బీజేపీ 312 స్థానాలను గెలుచుకుంది. అంటే గత ఎన్నికల కన్నా బీజేపీ కి ఈసారి 60 స్థానాలు తగ్గాయి. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి మొత్తంగా 128సీట్లు లభించాయి. ఇందులో ఎస్పీ 113సీట్లను గెలుచుకో గా,ఆర్ఎల్డీ 9, ఎస్‌బిఎస్‌పి ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఎస్పి లాభపడింది. 2017ఎన్నికల్లో కేవలం 47స్థానాలకే పరిమితమైన సమాజ్‌వాదీ పార్టీ ఈసారి ఏకంగా 66స్థానాలను మెరుగుప రుచుకుని తన సీట్లను 113కి పెంచుకుంది.గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా అసెంబ్లీకి పోటీచేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కర్హాల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో 19 స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా కాంగ్రెస్ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకుంది.
కుల, మత రాజకీయాలను సమాధి చేశారు : యోగి
బిజెపికి తిరిగి పట్టం కట్టడం ద్వారా ప్రజలు కుల, మత రాజకీయాలను సమాధి చేశారని ముఖ్యమంత్రి యోగి గురువారం వ్యాఖ్యానించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఇవిఎంల పట్లసందేహాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సాగించిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.