Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమృత్సర్ : పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం వెనుక పక్కాగా ఎన్నికల వ్యూహం ఉందనిస్పష్టమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ ప్రచారాన్ని ప్రారంభించింది. అక్కడ బరిలో ఉన్న పార్టీలు ఓట్లకు గాలం వేయటానికి ప్రయత్నిస్తే.. ఆప్ అధినేత కేజ్రీవాల్ అక్కడ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగమయ్యారు. ఢిల్లీ తరహాలోనే చీపురు సింబల్‌తో రంగంలోకి దిగారు. నాణ్యమైన విద్యబోధన జరిగేలా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను ప్రచార అస్త్రంగా ప్రయోగించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు 400 యూనిట్ల ఉచిత విద్యుత్, నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి, ఇంటింటికీ గ్యారెంటీ కార్డును నింపేలా ఫారాలిచ్చారు. ఇలా ఆప్ చెబుతున్న విషయాలు సామాన్యుల ఇండ్లకు చేరుకున్నది. గ్రామాల్లో ప్రజలు ఆప్‌కి మద్దతుగా నిలిచారు అందువల్ల వివాదరహితులైన వారికే పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. నగరాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా.. స్థానికంగా బలంగా ఉన్న దాదాపు 50 మంది ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని టిక్కెట్టు ఇచ్చారు. దీంతో గ్రామాలతో పాటు నగరాల నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించటానికి కారణమైంది.
కీలకంగా మారిన మూడు అంశాలు
పంజాబ్‌లో మార్పును పసిగట్టిన కేజ్రీవాల్.. పార్టీని అక్కడ బలంగా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, ప్రజాసమస్యలను కాంగ్రెస్ పట్టించుకోకపోవటం గమనించారు. ఇదే అదనుగా కేజ్రీవాల్ ప్రచార విధానాన్ని మార్చేశారు. మాల్వాలో పెద్ద ప్రభావం కనిపించింది.
ఆప్.. బయటి పార్టీ అని కాంగ్రెస్ ప్రచార అస్త్రంగా వినియోగించింది. దీన్ని తిప్పికొట్టడానికి భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు. ఫీడ్‌బ్యాక్ నుంచి ప్రకటన వరకు, మద్దతుదారులు , ప్రత్యర్థుల నాలుకలపై చర్చ జరిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. ముందుగా ఒక్క అవకాశం ఇవ్వమని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి విమర్శలు రాగానే...వెంటనే నినాదాన్ని మార్చారు. భగవంత్ మాన్ పేరుతో ఓట్లు అడగటం షురూ చేశారు.
పంజాబ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న 22 రైతు సంఘాల ఐక్య సమాజ్ మోర్చా. రైతు నాయకుడు బల్బీర్ రాజేవాల్ ఆప్‌తో పొత్తును నిరాకరించారు. ఈలోపు కేజ్రీవాల్ ధైర్యం చేసి 90 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటించారు. మిగతా సీట్లు ఇవ్వటానికి కేజ్రీవాల్ సిద్ధమైనా..రాజేవాల్ అంగీకరించలేదు. దీంతో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో గెలవటానికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.