Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి
- ఒక స్థానానికి తగ్గనున్న బీఎస్పీ ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ : పార్లమెంట్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతోంది. 2014 నుంచి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్, ఇప్పుడు రాజ్యసభలోనూ ఆ హోదా కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. జులై నాటికి రాజ్యసభలో మూడు పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పంజాబ్‌ను రెండు దశాబ్దాల పాటు పరిపాలించిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీకి చెందిన ఎంపీ రాజ్యసభలో ఉండరు. ఉత్తరప్రదేశ్‌లో ఏడేండ్లు అధికారంలో ఉన్న బీఎస్పీకి ఒకరే సభ్యుడు మిగులుతారు. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుని (ఎల్ఓపీ) పదవిని కోల్పోయే ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. తాజా ఎన్నికల ఫలితాలు ఈ మార్పులను నిర్దేశిస్తున్నాయి. పంజాబ్‌లోని ఏడు సీట్లు ఈ ఏడాది ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే ఐదు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మరో రెండు స్థానాలకు జులైలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సీట్లన్నీ పంజాబ్‌లో 92 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయి. ఏడు రాజ్యసభ స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌కు ముగ్గురు చొప్పున, బీజేపీకి ఒకరు ఉన్నారు. ఈ మూడు పార్టీలకు పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం ఉండదు. ఉత్తర ప్రదేశ్ నుంచి జులైలో పదవీ విరమణ పొందే వారి జాబితాలో బిఎస్పి సీనియర్ నేత సతీష్ మిశ్రా, అశోక్ సిద్ధార్థ్ ఉన్నారు. బీఎస్పీ సభ్యుడిగా శ్రీరామ్‌జీ ఒక్కరే ఉంటారు.
ఈ నెల 31న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అసోం నుంచి రెండు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక స్థానానికి కాంగ్రెస్ కోల్పోతోంది. పదవీ విరమణ పొందే వారిలో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికైన సభలో పార్టీ డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. గురువారం నాటి ఫలితాలతో పంజాబ్‌లోని మూడు స్థానాలను, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కో సీటును కాంగ్రెస్ కోల్పోతుంది. పదవీ విరమణ పొందే వారి జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి కపిల్ సిబల్, పంజాబ్ నుంచి అంబికా సోనీ ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను కోల్పోవచ్చు. కాంగ్రెస్ ప్రస్తుతం 34 మంది సభ్యుల సంఖ్య 26కి తగ్గుతుంది. రాజ్యసభ నియమ, నిబంధనల ప్రకారం ఏ పార్టీ అయినా ప్రతిపక్ష నేతగా ఉండాలంటే దాని బలం కనీసం 10 శాతం ఉండాలి. సభలో ప్రస్తుతం 237 మంది ఉన్నారు. కాబట్టి, పార్టీ ఎల్ఓపి పదవిని నిలబెట్టుకోవాలంటే 24-25 మంది సభ్యులు ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలన్న ప్రతిపక్ష పార్టీల ఆశలపై తాజా ఎన్నికల ఫలితాలు నీళ్లుచల్లాయి.