Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంను కోరిన మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్‌ల అసోసియేషన్ల సమాఖ్య
న్యూఢిల్లీ : ఔషధాల ప్రమోషన్‌కు సంబంధించిన చట్టబద్ధమైన మార్కెటింగ్ నిబంధనావళి కోసం కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరుతూ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్‌ల అసోసియేషన్ల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఔషధ మార్కెటింగ్ పద్ధతులకు ఒకే రకమైన నిబంధనావళిని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని, వీటి పర్యవేక్షణకు సమర్ధవంతమైన యంత్రాంగం, పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడాలని, ఒకవేళ ఉల్లంఘించిన పక్షంలో ఎదురయ్యే పర్యవసానాలను తెలియజేస్తూ, చట్టబద్ధమైన ప్రాతిపదిక కల్పించాలని పిటిషనర్లు కోరారు. ఆ చట్టం అమల్లోకి వచ్చేవరకు సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు విధించాలని కోరారు. పెద్దమొత్తంలో తమ మందుల అమ్మకాలు జరిగేలా భారత్‌లో మందుల ప్రమోషన్ కోసం, డాక్టర్లను ప్రభావితం చేయడం కోసం ఔషధ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు పెడుతుంటాయి. భారత్‌లో అత్యున్నత స్థాయిలో వున్న ఏడు ఫార్మా కంపెనీలు గత ఎనిమిదేళ్లలో రూ.34,186.95 కోట్లను మార్కెటింగ్‌పై ఖర్చు చేసినట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఆయా మందులన్నీ ధరలు పెరిగి, వ్యయభరితంగా తయారవుతున్నాయి. మందుల ఖర్చులో ప్రమోషన్ వ్యయం 20శాతం ఉంటోంది. దాంతో సామాన్యుడికి చేరేసరికి ఆ మందుల ధరలు అందరాని దూరంలో వుంటున్నాయని మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్‌ల సమాఖ్య పేర్కొంది. చట్టపరంగా ఒక నిబంధనావళిని అమలు చేయాలని ఇప్పటికి పలు సమావేశాల్లో పిటిషనన్లు ఆయా మంత్రిత్వ శాఖలను కోరాయి. దాంతో అరకొరగానే మంత్రిత్వశాఖ ఒక నిబంధనావళిని రూపొందించింది. దానికి ఎలాంటి చట్టపరమైన బాధ్యతను కల్పించలేదు. దాంతో పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.