Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రసిద్ధ తెలుగు కవి, గేయకర్త, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం కావ్యానికి ఎంపికైన అకాడమీ పురస్కారాన్ని సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర్ కంబరా అందించారు. దేశవ్యాప్తంగా 24 భాషల్లోని 24మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను అవార్డులు అందించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారికి రూ.లక్ష నగదుతో పాటు జ్ఞాపికను అందించారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం గ్రామంలో 1965 నవంబరులో జన్మించిన గోరటి వెంకన్న అనేక సినిమాలకు పాటలు రాయడంతో పాటు 'ఏకునాదం మోత', 'రేలపూతలు', 'అలసెంద్ర సంక', 'పూసిన పున్నమి', 'వల్లంకితాళం' వంటి కవితా సంపుటాలను రచించారు. ఇప్పటివరకు 2006లో కళావత్న(హంస) పురస్కారం, 2016లో కాళోజీ నారాయణరావు పురస్కారం వంటి అవార్డులను వెంకన్న అందుకున్నారు. అవార్డు అందుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితా సంపుటిని గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందని కవి గోరటి వెంకన్న అన్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వి రమణను కలిసిన గోరటి వెంకన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కలిశారు. శుక్రవారం నాడిక్కడ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అధికారిక గృహంలో ఆయనను గోరటి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన గోరటి వెంకన్నను ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ అభినందించారు. గోరటి వెంకన్నకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఆయనకు వల్లంకి తాళం కవిత సంపుటి పుస్తకాన్ని గోరేటి వెంకన్న అందించారు. ఎన్వి రమణ అభ్యర్థన మేరకు వెంకన్న అడవి తల్లిపై పాట పాడి వినిపించారు.