Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో 40 లక్షల మందికి పైగా కరోనాతో మృతి
- అధికారిక మరణాల సంఖ్య కంటే ఎనిమిది రెట్లు అధికం
- ఆ 8 రాష్ట్రాల్లో మరణాల రేటు ఎక్కువ : లాన్సెట్ అధ్యయనం
కరోనా విజృంభించక ముందే...ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మోడీ సర్కార్‌ను అప్రమత్తం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సకాలంలో ఆక్సిజన్ నిల్వలు..వెంటిలేటర్లు సమకూర్చలేదు. ప్రతి ఇంటి నుంచి ఒకరో ..ఇద్దరూ కోవిడ్ బారిన పడి చనిపోయారు. ఇలా వందలు..వేలు..లక్షల సంఖ్యలో కరోనా రోగులు చనిపోయారు. మరణాల సంఖ్యను దాచింది. చివరికి కరోనా మరణాలపై సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టే దాకా కేంద్రం కదల్లేదు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. నాడు దాచిన మరణమృదంగాన్ని లాన్సెట్ అధ్యయనంలో వివరించింది.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ను తీవ్రంగా కబళించిందా? భారత్‌లోనే అధిక మరణాలు నమోదయ్యాయా? మృతుల సంఖ్యను భారత ప్రభుత్వం దాచిందా? ఈ సంఖ్య అధికారిక సమాచారం కంటే ఎక్కువగా ఉన్నదా? ఈ అనుమానాలన్నీ నిజమేనని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. మహమ్మారి కాలంలో భారత్‌లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయని తెలిపింది. యూఎస్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ (ఐహెచ్ఎంఈ) నిపుణులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. 2020, 2021లో కరోనా మహమ్మారి కాలంలో భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందినట్టు అంచనా. ఇది భారత ప్రభుత్వం వెల్లడించిన అధికారిక మృతుల సంఖ్య కంటే ఎనిమిది రెట్ల కంటే అధికం. భారత ప్రభుత్వం ప్రకారం ఇప్పటి వరకు ఉన్న కరోనా మృతుల సంఖ్య కేవలం 5 లక్షలకు పైగా కావడం గమనార్హం. 2020 మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో 1.82 కోట్ల మంది ప్రజలు మరణించారు. మొత్తంగా మాత్రం భారత్‌లోనే మృతుల సంఖ్య అధికంగా ఉన్నది.
ఇక భారత్‌లో అత్యధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదైన విషయం విదితమే. ముఖ్యంగా, ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా మరణాలు రేటు ప్రతి పదివేల మందికి 200గా ఉన్నది. వీటిలో ఉత్తరాఖండ్, మణిపూర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కర్నాటకలు ఉన్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గోవాలలో మరణాల రేటు ప్రపంచ సగటు కంటే తక్కువగానే ఉన్నది. ఈ రాష్ట్రాలలో మరణాల సగటు ప్రతి పదివేల మందికి 120.6గా ఉన్నది. ఆరు లక్షల మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, బీహార్ మూడు లక్షల మరణాలతో రెండో స్థానంలో ఉన్నది. భారత్ తర్వాత అధ్యధిక మరణాలు యూఎస్‌లో నమోదయ్యాయి. ఇక్కడ మహమ్మారి కారణంగా 11.3 లక్షల మంది చనిపోయారు. అధికారిక మరణాల సంఖ్య కంటే ఇది 1.14 రెట్లు అధికం కావడం గమనార్హం.