Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమృత్సర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ సర్కారు కొలువుదీరటానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. 16 న మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. చంఢగీఢ్లో ఆప్ ఎమ్మెల్యేలు శుక్రవార్ సమావేశమయ్యారు. భగ్వంత్ మాన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. శనివారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈసారి ఆప్ సీఎంగా ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ స్వగ్రామమైన ఘట్కర్‌కలన్‌లో చేయనున్నట్టు మాన్ ఇప్పటికే ప్రకటించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ సమక్షంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రెండు చోట్లా ఓటమి పాలై, అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చన్నీ మాట్లాడుతూ.. ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దెహ్రాదూన్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ పుష్కర్ సింగ్ ఖతిమా నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. దీంతో రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది. పుష్కర్నే మరోసారి ఎన్నుకొంటారా లేదా గెలిచిన అభ్యర్థుల్లో ఒకరిని సీఎం చేస్తారా అన్న చర్చ నడుస్తోంది.