Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖండించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఇటీవల కోవిడ్ కారణంగా భారతదేశంలో సంభవించిన మరణాలు అధికారిక గణాంకాల కన్నా చాలా అధికంగా ఉన్నాయని పేర్కొంటూ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం ఊహాజనితమైనదని, తప్పుడు సమాచారంతో కూడినదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కారణంగా సంభవించిన మరణాల రేటు భారతదేశ జనాభా కారణంగా, ప్రపంచంలోనే అత్యధికం కాదని, కానీ, గతేడాది డిసెంబరు 31నాటికి ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో దాదాపు 20శాతానికి పైగా మరణాలు భారత్లోనే సంభవించాయని లాన్సెట్ నివేదిక ఇటీవల పేర్కొంది. ఈ గణాంకాలు, విశ్లేషణలకు అనుసరించిన పద్ధతుల్లో పలు లోపాలు ఉన్నాయని స్వయంగా అధ్యయన రచయితలే అంగీకరించారని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. వివిధ దేశాలకు వివిధ పద్దతులను ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుందని ఆ ప్రకటన తెలిపింది.
ఉదాహరణకు భారత్కు సంబంధించినంత వరకు అధ్యయనకర్తలు ఉపయోగించిన డేటా వనరులు వార్తాపత్రికల కథనాల నుంచి తీసుకున్నవి తప్ప సూక్ష్మంగా పరిశీలనాత్మకంగా జరిపిన అధ్యయనాలు కావని వివరించింది. అన్ని రకాలుగా మరణించిన వారి డేటాను ఇందులో ఉపయోగించడంతో ఈ గణాంక ప్రక్రియ ఫలితాల కచ్చితత్వం పట్ల తీవ్రమైన ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన పేర్కొంది. ప్రపంచదేశాలను తీవ్రంగా అతలాకుతలం చేస్తున్న కోవిడ్ మహమ్మారి వంటి ఆరోగ్య సంక్షోభ సమయాల్లో ఇటువంటి అంశాలు చాలా సున్నితంగా వుంటాయని, అటువంటప్పుడు వాస్తవాలు తెలుసుకుని, కచ్చితత్వంతో కూడిన సమాచారమే ఇవ్వాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఊహాజనితమైన వార్తా కథనాలను ఇవ్వడం వల్ల మొత్తంగా ప్రజల్లో తీవ్రంగా భయాందోళనలు నెలకొంటాయని తద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి వీలుంటుందని, అలా జరగకుండా దాన్ని నివారించాల్సి వుంటుందని పేర్కొంది. గత నెల్లో కూడా ఇటువంటి వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. కోవిడ్ మరణాలను లెక్కించేందుకు తమ వద్ద సరైన యంత్రాంగం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.