Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22మందికి గాయాలు
భువనేశ్వర్ : ఒడిశాలో జనంపైకి ఎంఎల్ఎ కారు దూసుకెళ్లడంతో 22 మంది గాయాల పాలయ్యారు. ఖుర్దా జిల్లాలోని బనాపూర్లో గుమిగూడిన జనాలపైకి చిలికా బిజూ జనతాదళ్ (బిజెడి) బహిష్కృత ఎంఎల్ఎ ప్రశాంత్ జగ్దేవ్ వాహనం దూసుకెళ్ళిడంతో ఏడుగురు పోలీసు సిబ్బందితో సహా 22మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వాహనం దూసుకెళ్లిన వెంటనే ఆగ్రహానికి గురైన ప్రజలు ఎంఎల్ఎను చితకబాదారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ప్రజల దాడితో తీవ్రంగా గాయపడిన ఎంఎల్ఎకు తొలుత తంగి ఆస్పత్రిలో చికిత్సనందించారు. అనంతరం భువనేశ్వర్ తరలించారు. పంచాయతీ బ్లాక్ ఛైర్పర్సన్ ఎన్నిక జరుగుతుండడంతో బిడిఓ బనాపూర్ కార్యాలయం వెలుపల ప్రజలు గుమిగూడి ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. బనాపూర్ పోలీసు స్టేషన్ ఇనస్పెక్టర్ ఇన్చార్జి ఆర్.ఆర్.సాహుతో సహా ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 15మంది బిజెపి కార్యకర్తలు, ఏడుగురు పోలీసులు గాయపడ్డారని, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఎంఎల్ఎ మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గతేడాది సెప్టెంబర్‌లో జగ్దేవ్ను బిజెడి నాయకత్వం సస్పెండ్ చేసింది.