Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష!
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో ఓటమిపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం వర్చువల్‌గా జరగనున్నది. ఈ సమావేశంలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లో ఘోర ఓటమిపై చర్చించనున్నారు. కాంగ్రెస్ తన బలమైన పంజాబ్‌ను కోల్పోయింది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో కనీసం గట్టి పోటీ ఇవ్వకపోవటం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఘోర పరాభవం ఎదురైంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు చేపట్టాలని గతకొంత కాలగా డిమాండ్ చేస్తున్న అసమ్మతివాదుల బృందం (జీ 23) సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో గురువారం సమావేశమైంది. పార్టీ పనితీర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిసింది.
నూతన అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని జీ-23 కోరుతోంది. నూతన అధ్యక్ష ఎన్నికలో జాప్యం చేయొద్దని అధిష్టానానికి తెలిపింది. ఈ సమావేశంలో కపిల్ సిబాల్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, అఖిలేష్ ప్రసాద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల పరాజయానికి జవాబుదారీతనం పరిష్కరించాలని, పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూర్పులో మార్పులు చేయాలని నాయకులు కోరుతున్నారు. సంస్థాగత ఎన్నికల అంశంపై కూడా చర్చ జరిగింది. పార్టీ నాయకత్వం పనితీరుతో జీ-23 నాయకులు విసిగిపోయినట్టు సమాచారం.
''కాంగ్రెస్‌లో మొదటి కుటుంబం పక్కకు తప్పుకుని కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ నాయకులతో కలిసి పని చేయండి. పార్టీ పని కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండండి. దేశంలో కాంగ్రెస్ లేకపోతే పునరుజ్జీవనం ఉండదు'' అని అసమ్మతివాదుల బృందం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, 23 మంది ఇతర సభ్యులు ఉన్నారు. వీరులో 12 మంది ద్వారా ఎంపికయ్యారు. గత సమావేశం 2021 అక్టోబర్‌లో జరిగింది.