Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16న భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామంలో ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ ఈనెల 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన నవన్షార్ జిల్లాలోని ఖట్కార్ కలాన్‌ను ప్రమాణ స్వీకారానికి వేదికగా నిర్ణయించుకున్నారు. ఆయన శనివారం పంజాబ్ గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆప్ ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..''ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఆప్ సిద్ధంగా ఉందని గవర్నర్సాబ్కు తెలియజేశాను. అందుకు ఆయన అంగీకరించారు. మార్చి 16న ఖట్కార్ కలాన్‌లో ఉదయం 12.30గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించా''మని చెప్పారు.
దీనికంటే ముందు ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. భేటీలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు.
అదే రోజు మొహాలీలో జరిగిన ఆప్ శాసనసభ్యుల సమావేశంలో శాసనసభ నాయకుడిగా మాన్‌ను పార్టీ ఎన్నుకుంది. మరోవైపు అమృత్‌సర్‌లో ఆదివారం విజయోత్సవ రోడ్ షో నిర్వహించాలని ఆప్ నిర్ణయించింది. మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంతో పాటు ఆదివారం జరగనున్న రోడ్ షోకూ ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ..ఆప్ ఏకంగా 92 చోట్ల విజయభేరి మోగించిన విషయం తెలిసిందే.