Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు సజీవ దహనం
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోకుల్‌పురి ప్రాంతంలో ఉన్న గుడిసెలు శనివారం తెల్లవారుజామున దగ్ధమవడంతో, ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 30 గుడిసెలు పూర్తిగాను, మరో 30 గుడిసెలు పాక్షికంగాను దగ్ధమయ్యాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మృతుల్లో రోషన్ (13), అతని సోదరి దీపిక (9), మరో కుటుంబానికి చెందిన బబ్లూ (32), రంజిత్ (25), రేష్మ (18), ప్రియాంక (20), షహంష (10) ఉన్నారు. రోషన్, దీపికల తాత సంతు మాట్లాడుతూ, తాము నిద్రిస్తున్న సమయంలో 12.30 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించాయని చెప్పారు. తెల్లవారుజామున 1.03 గంటలకు ప్రమాద సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్ అధికారి తెలిపారు. 13 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని తెల్లవారుజామున 4 గంటల సమయానికి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఘటనా స్థలం నుంచి కాలిపోయిన ఏడు మతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందాలు సంఘటనా స్థలాన్ని సందర్శించాయని ఆయన చెప్పారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
నష్టపరిహారం త్వరలో అందజేస్తాం : సిఎం కేజ్రీవాల్
ఈ ప్రమాదంలో మరణించిన మైనర్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, పెద్దల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుడిసెలు కాలిపోయిన వారికి రూ.25 వేలు నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పరిహారం ఒకటి రెండు రోజుల్లో అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.