Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్‌పై వడ్డీ 8.1శాతానికి తగ్గింపు
- 43 ఏండ్లలోనే కనిష్టస్థాయికి
- తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ : ఇలా ఎన్నికలు ముగిసాయో లేదో..కోట్లాదిమంది ఉద్యోగులకు మోడీ సర్కార్ షాకింగ్ న్యూస్ ఇచ్చింది. మునుపెన్నడూ లేనంతగా ఈపీఎఫ్‌వో (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) వడ్డీరేట్ను గణనీయంగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో ఈపీఎఫ్‌వో ఖాతాదార్లకు 8.1శాతం వడ్డీరేటు చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. శనివారం గౌహతీలో సీబీటీ సమావేశమైంది. ఈ భేటీలో పీఎఫ్ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకున్నట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 8.1శాతం వడ్డీరేటు నిర్ణయాన్ని సీబీటీ కేంద్ర ఆర్థికశాఖకు పంపనున్నది. ఆర్థికశాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. గత ఏడాది ఈపీఎఫ్‌పై 8.5శాతం చెల్లించారు. అంతర్జాతీయంగా
నెలకొన్న పరిస్థితులు, మార్కెట్లో అనిశ్చిత నెలకొందని, ఈనేపథ్యంలో రిస్క్‌తో కూడిన పొదుపు మార్గాల్లో ఈపీఎఫ్‌వో పెట్టుబడులు పెట్టలేదని కాబట్టి వడ్డీరేటు తగ్గించాల్సి వచ్చిందని కేంద్ర కార్మికమంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని సీబీటీ తన నిర్ణయాన్ని వెలువరించిందని, సామాజిక భద్రత, మార్కెట్ స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో 6కోట్లమందికి పైగా ఖాతాదార్లు ఉన్నారు. ఈపీఎఫ్ కార్పస్ ఫండ్ రూ.8.29లక్షల కోట్ల నుంచి రూ.9.4లక్షల కోట్లకు(2021-22) చేరుకుంది. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది మొదలు ఈపీఎఫ్ఓ వడ్డీరేటు తగ్గిస్తూ వస్తోంది. 2015-16లో 8.8శాతం చెల్లించగా, అటు తర్వాత వరుసగా 8.65శాతం, 8.55శాతం, 8.65శాతం, 8.5శాతం, 8.5శాతానికి తగ్గించింది. ఇప్పుడు వడ్డీరేటుకు భారీగా కోత విధిస్తూ 8.1శాతం నిర్ణయించటం చర్చనీయాంశ మైంది. 43ఏండ్ల క్రితం 1977-78లో ఈపీఎఫ్‌వో వడ్డీరేటు 8శాతం ఇచ్చారని, అటు తర్వాత అంత కనిష్టస్థాయికి ఎప్పుడూ చేరలేదని ఉద్యోగ, కార్మిక సంఘాలు చెబుతున్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరం (2022-23లో) ఈపీఎఫ్‌వో ఆదాయం రూ.76,768కోట్లు ఉంటుందని అధికారులు అంచ నావేస్తున్నారు. బోర్డ్‌కు ఇంత పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతున్నా వడ్డీ రేట్లను తగ్గంచటం ఖాతాదార్లను తీవ్రంగా నిరాశపరుస్తుందని, ఆర్థికరంగంలో నెలకొన్న అనిశ్చితిని ప్రస్తుత నిర్ణయం ప్రతిబింబిస్తోందని సీబీటీ సభ్యుడు ఎ.కె.పద్మనాభన్ అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రజలకు బీజేపీ రిటర్న్ గిఫ్ట్ : కాంగ్రెస్
ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది.. అంటూ కాంగ్రెస్ విమర్శించింది. దేశంలోని 84 శాతం ప్రజల ఆదాయం తగ్గిందని, ఎన్నికల విజయం ఆధారంగా కోట్లాది మంది ఉద్యోగుల పొదుపుపై దాడి చేయడం సరైనదేనా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.