Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎల్ఎల్ బిడ్డింగ్‌లో కేరళ పాల్గొనకుండా నిరోధించటంపై సీఎం విజయన్: ప్రధాని మోడీకి లేఖ
తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) బహిరంగ బిడ్డింగ్‌లో కేరళ పాల్గొనకుండా నిరోధించటాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది సహకార సమాఖ్య విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు భారత ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. కేరళలోని హెచ్ఎల్ఎల్లో పెట్టుబడుల ఉపసంహరణను కేంద్రం ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే, కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. హెచ్ఎల్ఎల్ను రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా కొనసాగించడానికి అవకాశమివ్వాలని కోరుతున్నది. విజయన్ ప్రధానికి రాసిన లేఖలో పలు అంశాలను లేవనెత్తారు. బహిరంగా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించడం సహకార సమాఖ్య సూత్రాలకు అనుగుణంగా ఉండదని సీఎం వివరించారు. ఇలాంటి విషయాల్లో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. హెచ్ఎల్ఎల్ ప్రయివేటీకరణను కొనసాగించవద్దని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ 2017 జూన్‌లో తాను ఇప్పటికే లేఖ పంపిన విషయాన్ని విజయన్ ఎత్తి చూపారు. అయినప్పటికీ కేంద్రం పెట్టుబడుల ఉపసంహ రణకు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తిని వ్యక్తం చేసిందని సీఎం వివరించారు. నిర్ధిష్ట ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి హెచ్ఎల్ఎల్ కోసం భూమిని సేక రించి కేరళ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిన విషయాన్ని ప్రధాని గమనిం చాలని కోరారు. ''కేంద్రం హెచ్ఎల్ఎల్ను ప్రభుత్వ సంస్థగా కొనసాగించ కూడదని ప్రతిపాదిస్తే, దానిని దానిని రాష్ట్ర పీఎస్‌యూగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆప్షన్ ఇవ్వాలి. భూమిని, కేరళలోని హిందుస్థాన్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఆస్థులు కలిగి ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి హక్కు ఇవ్వా లి'' అని వివరించారు. కేరళలోని హెచ్‌ఎల్‌ఎల్‌కు చెందిన భూమి, ఆస్థులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని లేదా ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియలో పీఎస్‌యూ ఉపసంహరణకు సంబంధించిన ప్రతిపాదన ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించాలని మోడీని విజయన్ అభ్యర్థించారు.