Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాలు ధ్వంసం
- నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత చోటు చేసుకున్న ఘటనలు
- అధికార బీజేపీ హస్తం : సీపీఐ(ఎం)
కోల్‌కతా,అగర్తల : త్రిపురలో రాజకీయ హింస చెలరేగింది. రాష్ట్రంలో ప్రతిపక్ష సీపీఐ(ఎం) పార్టీ, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ నెల 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన విషయం విదితమే. అయితే, బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన అనంతరం ఈ అల్లోకల్లోల ఘటనలు త్రిపురలో చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ దాడుల వెనక అధికార బీజేపీ హస్తమున్నదనీ, కాషాయమూకల వెనకుండి ఇలాంటి దారుణ చర్యలను ప్రోత్సహిస్తున్నదని సీపీఐ(ఎం) ఆరోపించింది. రాష్ట్ర రాజధాని అగర్తలలో త్రిపుర మోటార్ వర్కర్స్ యూనియన్స్ కేంద్ర కార్యాలయాన్ని దోచుకున్నారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. రంజిత్నగర్లో సీపీఐ(ఎం) మద్దతుదారుడు అయిన బిజోరు బిశ్వాస్కు చెందిన గ్రోసరీ షాప్‌ను ధ్వంసం చేశారు. సీపీఐ(ఎం) సబ్‌డివిజనల్ కమిటీ కార్యాలయం, లాయర్ మిన్హాజ్ అహ్మద్ మీద దుండగులు దాడికి దిగారు. దుర్గా చౌముహనిలో పార్టీ కార్యకర్త అపు పాల్ దుకాణాన్ని కూలగొట్టారు. క్రిష్ణానగర్లో సీపీఐ(ఎం) స్థానిక కమిటీ సభ్యులు గోపాల్ మలకర్ ఇంటిపై హిందూత్వ శక్తులు బాంబులు వేశాయి. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి హింసాత్మక ఘటనలు, దాడులు, దోపిడీలు చోటుచేసుకున్నాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రెటేరియట్ మెంబర్ పబిత్ర కర్ ఇంటి పైనా దాడి జరగడం గమనార్హం. పలు దుకాణాలపై దాడులు చేసి అందినకాడికి దోచుకున్నారు.
అగర్తలలోని ఖైర్పూర్, రాణిబజార్, రాజ్‌నగర్, మోహన్పూర్, కుమార్‌ఘాట్, ఫతిక్రేలలో ఫలితాలు వెలువడిన గురువారం రాత్రి వరకూ హింస కొనసాగింది. వంద మందికి పైగా పార్టీ కార్యకర్తలపై దాడి జరిగింది. వారి ఆస్థులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ఇంతగా హింస చెలరేగినప్పటికీ ఆ రాష్ట్ర సీఎం మాత్రం దానిని ఇప్పటికీ ఖండించలేదు. ఇప్పటి వరకూ, రాష్ట్రంలో ఇలాంటివి 39 ఘటనలు జరిగాయి. మైనారిటీ వర్గాలకు చెందిన వామపక్ష కార్యకర్తల ఇండ్ల పైనే కాకుండా మసీదులనూ లక్ష్యంగా చేసుకుంటూ హిందూత్వ శక్తులు దాడులు చేశాయి.
బిషల్గఢ్లో సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేశారు. ముగ్గురు సీపీఐ(ఎం) కార్యకర్తలపై తీవ్రంగా దాడికి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కుమార్‌ఘాట్ డివిజన్లో పార్టీ ఏరియా కమిటీ కార్యాలయం దోపిడీకి గురైంది. ఫర్నీచర్‌ను దుండగులు ధ్వంసం చేశారు. జమల్పూర్, సోనముర, సదర్ డివిజన్లలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ దాడులపై సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరీ బహిరంగ లేఖ రాశారు. సీఎం రాజ్యాంగం మీద చేసిన ప్రమాణం ప్రకారం పౌరుల హక్కులు, ప్రజల జీవితం, వారి ఆస్థుల పరిరక్షణకు బాధ్యత వహించాలన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక రాజకీయ పార్టీ ఇలాంటి దాడుల్లో తరచూ భాగమవుతోందని పేర్కొన్నారు. సీఎం రాజకీయ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి దాడి పైనా దర్యాప్తు జరపాలనీ, అన్ని కేసుల్లో దోషులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోడీ సర్కార్ ప్రతీకార దాడి : సీతారాం ఏచూరి
దేశంలోని శ్రామిక ప్రజలపై మోడీ సర్కార్ ప్రతీకార దాడి చేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించడంపై ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత మోడీ ప్రభుత్వం ప్రతీకారంతో శ్రామిక ప్రజలపై మరిన్ని దాడులకు దిగింది. ఉద్యోగాల తొలగింపు, ధరల పెరుగుదల మొదలైన వాటితో పెరుగుతున్న కష్టాల నేపథ్యంలో వచ్చే ఈ దాడిని కార్మికలోకం ప్రతిఘటించాలి'' అని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.