Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారుణంగా దెబ్బకొట్టిన కోవిడ్ సంక్షోభం
- లాక్డౌన్ సమయంలో రూ.20వేల కోట్ల ఎన్పీఏలు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, లాక్డౌన్ దెబ్బకు భారత్లో ఎంఎస్ఎంఈల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ యూనిట్లు మూతపడ్డాయి. మరెన్నో యూనిట్లు రుణ ఊబిలో కూరుకుపోయాయి. ముఖ్యంగా మొదటిసారి విధించిన లాక్డౌన్ ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాంతో ఈ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) పెద్ద ఎత్తున పెరిగాయని, సెప్టెంబర్ 2020-సెప్టెంబర్ 2021 మధ్యకాలంలో ఎన్పీఏలు రూ.20వేల కోట్లు పెరిగాయని సమాచారం. దాంతో ఈ రంగంలో మొండి బకాయిలు రూ.1,45,673 కోట్ల నుంచి రూ.1,65,732కోట్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తాజాగా గణాంకాలు విడుదల చేసింది.
ఆర్బీఐ లెక్క ప్రకారం, ఎంఎస్ఎంఈ మొండి బకాయిల్లో పెరుగుదల 8.8శాతం(సెప్టెంబర్ 2019), ఆ తర్వాత ఏడాది 8.2శాతం (సెప్టెంబర్ 2020), కోవిడ్ సంక్షోభం నెలకొన్న సమయంలో 9.6శాతం (సెప్టెంబర్ 2021నాటికి) నమోదైంది. మొత్తం మొండి బకాయిల్లో రూ.1,37,087లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులవే ఉన్నాయి. మార్చి 2020లో తలెత్తిన కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మోడీ సర్కార్ ఏకపక్షంగా దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసాక, ఈరంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోడీ సర్కార్ పలు రుణ ప్యాకేజీలు ప్రకటించింది. అయినప్పటికీ లక్షలాది యూనిట్లు తిరిగి కోలుకోలేదని, ఈరంగంలో ఏర్పడ్డ స్తబ్దత అలాగే కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు.