Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సెబీ ఆమోదం తెలిపినదాని ప్రకారం..ఎల్ఐసీ ఐపీవోకు గడువు మే 12. అయితే ఇప్పటివరకూ కేంద్రం ఐపీవో ప్రక్రియను పూర్తిచేయలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం అడ్డంకిగా మారిందని, దాంతో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనేపథ్యంలో ఐపీవోకు వెళ్లటం మదుపర్లకు నష్టాలు తీసుకొస్తుందని అంచనా వేస్తున్నాయి. సెబీ ఇచ్చిన గడువు మే 12 దాటితే మరోసారి ఐపీవోకు వెళ్లాలంటే.. తిరిగి సెబీకి దరఖాస్తు చేయాల్సి వుంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఈ అంశంపై స్పందించారు. మే 12వరకు ఐపీవో ప్రక్రియను ప్రారంభించేందుకు సమయముందని సంస్థకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. అప్పటివరకు తిరిగి తాజా ముసాయిదా పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆ గడువు దాటితే..మరోసారి ఐపీవోకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికే ఎల్ఐసీ ఐపీవో ప్రక్రియను పూర్తిచేయాలని కేంద్రం భావించింది. కానీ ఉక్రెయిన్ సంక్షోభం, మార్కెట్ ఒడిదొడుకులు కారణంగా ఐపీవోను వాయిదా వేస్తూ వస్తోంది. ఫిబ్రవరి 13న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం కేంద్రం సెబీకి ముసాయిదా పత్రాల్ని దాఖలుచేసింది. ఎల్ఐసీలో 5శాతం వాటాకు సమానమైన 31.6కోట్లకుపైగా రూ.10ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనున్నది. ఈ ఐపీవో ద్వారా రూ.63వేల కోట్లు కేంద్ర ఖజానాకు చేరుతాయని అంచనా.స్టాక్ మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తూ త్వరలో ముసాయిదా పత్రాలు సమర్పించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు దీనికి సంబంధించి సదరు అధికారి తెలిపారు. అందులో ధరల శ్రేణి, వివిధ వర్గాల వాటా వంటి వివరాలు ఉంటాయన్నారు. ఈ ఐపీవో ద్వారా రిటైల్ మదుపర్ల నుంచి రూ.20వేల కోట్ల వరకు సమీకరించాలనే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా చిన్న మదుపర్లు అంత మొత్తం షేర్లకు బిడ్ వేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. మార్కెట్లు కోలుకొని..మదుపర్లలో విశ్వాసం నెలకొనే వరకూ వేచిచూడాలని కేంద్రం భావిస్తోంది.