Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు పోలీస్ జవాన్లకు గాయాలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో డిస్టిక్ రిజర్వ్ పోలీస్ జవాన్లు ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుక్మా జిల్లాలో చిచ్చర గూడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో సమావేశం అయ్యారనే సమాచారంతో జిల్లా రక్షణ దళానికి చెందిన పోలీసులు, జిల్లా రిజర్వు పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ముందుగానే పోలీసుల రాకను పసిగట్టి కాల్పులకు తెగబడ్డారు. మావోయిస్టుల కాల్పులకు పోలీసులు వెంటనే తేరుకుని ఎదురు కాల్పులు జరిపారు. దాంతో మావోయిస్టులు వెనుదిరిగి అడవిలోకి పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఎదురు కాల్పుల్లో ఇద్దరు డీఆర్ జవాన్లు.. చమురు రామ్ పోయెమ్, నెహ్రూ లాల్ కశ్యప్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని సుక్మా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేరళ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనతో జిల్లా కేంద్ర వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.