Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య సంస్థల్లో సర్దుబాటు చేయండి
- రుణాలను మాఫీ చేయండి :కేంద్ర విద్యా శాఖ మంత్రికి ఎస్ఎఫ్ఐ లేఖ
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి దేశానికి వచ్చిన విద్యార్థులకు పునరావాసం కల్పించాలని ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ లేఖ రాశారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధం వారి విద్యాభ్యాసం, శిక్షణ ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేసిందని తెలిపారు. మధ్యలో ఆగిపోయిన వారి వైద్య విద్య గురించి జాతీయ వైద్య కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోనందున వారు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు, ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి తమ కోర్సు పూర్తి చేయాల్సిన చివరి సంవత్సరం విద్యార్థులకు దేశంలోని వైద్య సంస్థల్లో వసతి పొందేందుకు, వారి విద్యను పూర్తి చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఇతర విద్యార్థులు కూడా వారి విద్యా సంవత్సరాల్లో ఎక్కువ భాగాన్ని కోల్పోతున్నారని, విద్యను పొందే వారి హక్కు నిరాకరణకు గురికాకూడదని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న, మధ్యలోనే భారతదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు విద్య, వసతి కల్పించడానికి దేశంలో ఎటువంటి నిబంధనలు లేవని పేర్కొన్నారు. అందువల్ల పౌరులెవరూ విద్యపై ప్రాథమిక హక్కును కోల్పోకుండా ఉండేలా ప్రభుత్వం విధానాలను రూపొందించాలని సూచించారు. ఆ విద్యార్థులందరూ వైద్య సంస్థల్లో చదువుకునేలా సర్దుబాటు చేయడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
విద్యా రుణాలను మాఫీ చేయండి
విద్యార్థుల్లో చాలా మంది రుణాలు తీసుకున్నారని తెలిపారు. విద్యార్థులు చదువుల కోసం తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లే పరిస్థితి లేనందున, వారు చదువుతున్న కోర్సుల నుంచి చదువును అర్ధాంతరంగా ముగించాలని నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో వారు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేరని తెలిపారు. దేశంలో వారి చదువును కొనసాగించడానికి వారికి అవకాశం కల్పించినప్పటికీ, ఉక్రెయిన్‌లో ఉన్న దాని కంటే ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంది విద్యార్థులు ఆ ఫీజులు భరించలేరని, అందువల్ల వారి వైద్య ఆకాంక్షలను పూర్తిగా వదిలివేయవచ్చని తెలిపారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చే విద్యార్థుల విద్యా రుణాలను మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానసిక వేదన, ఒత్తిడికి గురవుతున్న వేలాది మంది విద్యార్థుల మనోవేదనలను పరిష్కరించడానికి, వారందరూ చదువుకునేందుకు మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.