Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాలు.. పెన్షన్ ఇవ్వాలి.
- చలో పార్లమెంట్‌కు ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజన కార్మికులు సిద్ధం
న్యూఢిల్లీ : ప్రాథమిక సేవా పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ స్కీమ్ వర్కర్లు ఈ నెల 15న పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్), మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎండీఎండబ్ల్యూఎఫ్ఐ), ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఆశా వర్కర్స్ (ఎఐసీసీడబ్ల్యూ) సంయుక్తంగా చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చాయి. ఐసీడీఎస్, ఎండిఎంఎస్, ఎన్హెచ్ఎం తదితర ప్రాథమిక సేవల పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధూ డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాలు జరుగుతున్నాయని తెలిపారు. అణచివేతకు వ్యతిరేకంగా హర్యానాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు డిసెంబరు 8 నుంచి నిరవధిక సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు. 26 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, 25 లక్షల మంది మధ్యాహ్న భోజన కార్యకర్తలు, 10 లక్షల మంది ఆశా కార్యకర్తలు దేశంలోని ప్రతి ఇంటికీ సేవలను అందజేస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్-19 విధులను మూడు దశల్లో క్వారంటైన్ కేంద్రాల నుంచి వ్యాక్సినేషన్ వరకు నిర్వహించారని వివరించారు. ప్రభుత్వం వారికి ఎలాంటి రిస్క్ అలవెన్స్ చెల్లించలేదని, ఎటువంటి భద్రతా సామగ్రిని కూడా అందించలేదని విమర్శించారు. దీంతో, కోవిడ్ బారినపడి అనేక మంది ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు అమరులయ్యారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం గత కేంద్ర బడ్జెట్లో (2021-22) ఐసీడీఎస్ కేటాయింపుల్లో అంతకుముందు ఏడాది కంటే 30 శాతం, మధ్యాహ్న భోజనం పథకం నిధులు రూ.1,400 కోట్ల కోత విధించిందని అన్నారు. ఈ ఏడాది కూడా ఎండీఎంఎస్కు బడ్జెట్ కేటాయింపులో రూ.1,200 కోత పెట్టిందని, ఎన్హెచ్ఎం కోసం బడ్జెట్ కేటాయింపులో పెరుగుదల లేదని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బడ్జెట్ కేటాయింపుల్లో తగ్గుదల ఉందని, దీంతో నెలల తరబడి ఉన్న కొద్దిపాటి రెమ్యూనరేషన్ కూడా చెల్లించడం లేదని విమర్శించారు. ఇది ఆరోగ్యం, పౌష్టికాహార సేవలపైనా తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. స్కీమ్ వర్కర్లు తమ పని పరిస్థితులు, పథకాల మెరుగుదల కోసం నిరంతర పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం జంతర్ మంతర్ వద్ద ఈ నెల 15న పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు సరైన ఆరోగ్య సంరక్షణ, పిల్లలకు పోషకాహారం, నాణ్యమైన ఈసీసీఈ సేవలను అందించడానికి, అలాగే నెలకు రూ.10,000 కోవిడ్ రిస్క్ అలవెన్స్, కనీస వేతనాలను నిర్ధారించడానికి, ఐసీసీఎస్, ఎన్హెచ్ఎం, ఎండీఎంఎస్లకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలనే తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల మేరకు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం
కార్యకర్తలకు నెలకు రూ.26,000, పెన్షన్, సామాజిక భద్రత, పథకాలను ఏ రూపంలోనూ ప్రయివేటీకరించకూడదని స్పష్టంగా ఉందని తెలిపారు.