Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వాన్ని నమ్ముకున్న బీజేపీ అధినాయకత్వం
- అయినా.. వారి మత ఎజెండాను వ్యతిరేకిస్తూ 55శాతం ఓటింగ్
- సంక్షేమం, పాలన చూసి ఓటేశారని చెప్పలేం : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : అధిక ధరలు, నిరుద్యోగం, కోవిడ్ కష్టాల్ని పరిష్కరించటంలో పాలకులు విఫలమైనా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి విజయం దక్కటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నికల్లో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా..యూపీలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వెళ్లిన ప్రతిచోటా బీజేపీ నాయకులు ఏం మాట్లాడారన్నది అందరికీ తెలిసిందే. హిందూత్వం, మత ప్రాతిపదికన ఓటర్లను చీల్చి..గెలుపు సాధించాలన్న వ్యూహాన్ని బీజేపీ ఎంచుకుంది. ఆ వ్యూహంలో భాగంగానే మునుపెన్నడూ లేనంతగా ఆ రాష్ట్రంలో హిందూత్వాన్ని, విద్వేషాన్ని పాలకులు విస్తరించారు. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రసంగాలు చేశారు.
రాష్ట్రంలో 80శాతం హిందువులు తమకు మద్దతుదారులుగా, 20శాతం ముస్లింలు వ్యతిరేకులుగా జరుగుతున్న ఎన్నికలివి..అని సీఎం యోగి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో తమ పార్టీవైపు 80శాతం ఓటర్లు నిలబడ్డారని, 20శాతమున్న ముస్లింల ఓట్లు తమకు అక్కర్లేదని..ప్రతిచోటా తన ప్రసంగంలో యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ప్రతి నియోజికవర్గంలో మత ప్రాతిపదికన ఓటర్లను చీల్చడానికి చేసిన ప్రయత్నమిది. సంక్షేమ పథకాలు, తమ పాలన చూసి ఓటేయాలని ఎక్కడా అడగలేదు. అలాంటిది..యూపీలో బీజేపీ విజయానికి కారణం సంక్షేమ పథకాలు, పాలన..అంటూ ఆ పార్టీ నాయకులు చెప్పుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
తాజా ఎన్నికల్లో మత విద్వేషాన్ని పెంచటమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం సాగింది. హిందువులంతా తమ ఎజెండాకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అయితే తాజా ఎన్నికల్లో అధికార బీజేపీకి 41.77శాతం ఓటింగ్ దక్కింది. ఆ పార్టీతో కలిసి పోటీ చేసిన వారికి దక్కిన ఓటింగ్‌ను కలుపుకుంటే 45శాతం అవుతోంది. దీని ప్రకారం ఓటర్లలో 55శాతం బీజేపీ ఎజెండాను వ్యతిరేకించారన్నది అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా కూడా బీజేపీ వ్యతిరేక ఓటుగానే భావించాలని చెప్పారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలు, యోగి సర్కార్ బుల్డోజర్ పాలసీలు, హిందూత్వాన్ని 55శాతం ఓటర్లు తిరస్కరించారని తెలుస్తోంది.
''మోడీ, యోగీ గత ఐదు సంవత్సరాలుగా మతోన్మాదాన్ని ఎంతగా రెచ్చగొట్టినా అదనంగా కేవలం 1.5శాతం ఓట్లే సాధించారు. ఇది మతోన్మాద ఎజెండాకున్న పరిమితి. కారణం ఏదైనా 40శాతం ఓటర్లు అసలు ఓటే వేయలేదు. అంటే వీరిని మతోన్మాదం కదలించలేదు. పురోగామి శక్తులు ఈ విషయాల్ని కూడా గమనంలో ఉంచుకోవాలి'' ప్రముఖ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు బీజేపీ విధానాల్ని వ్యతిరేకించినా..వాటిని ప్రతిపక్షాలు తమకు సానుకూలంగా మార్చుకోలేకపోవటం కనపడుతోంది. బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయంగా ఓటర్లకు నమ్మకం కల్పించకపోవటం, వ్యతిరేక ఓటు చీలటం యూపీలో బీజేపీ విజయానికి దారితీసిందని తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ తరహా వ్యూహాన్నే ప్రధాని మోడీ ఎంచుకుంటారని, మత విద్వేషాన్ని మరింత పెంచి తద్వారా ఓటింగ్ సాధించుకునే ప్రయత్నం చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మోడీ, అమిత్ షాలతో యోగి భేటీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఢిల్లీలో బిజిబిజీగా గడిపారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా అనేక మంది నాయకులతో వరస సమావేశాలు నిర్వహించారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. తాజా సమావేశాల్లో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య భవితవ్యంపైతో సహా అనేక విషయాలపై చర్చించారు. సిరతు నియోజకవర్గం నుంచి ఓడిన మౌర్య ప్రస్తుతం ఎంఎల్సీగా కొనసాగుతున్నారు. ఉచిత విద్యుత్, చెరకును మిల్లులకు సరఫరా చేసిన 15 రోజుల్లో రైతులకు చెల్లింపు తదితర వాగ్దానాలను అమలుపైనా యోగి చర్చించినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాతోనూ యోగి సమావేశమయ్యారు. ఈ నెల 19 తరువాతే యోగి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.