Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు కలిసికట్టుగా పోరాడాలి : సీపీఐ(ఎం)
- మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ కుట్రలు..
- రాజ్యాంగ హక్కుల కోసం ప్రజాస్వామ్యవాదులు ఒక్కటవ్వాలి..
న్యూఢిల్లీ : మత విభజన, మీడియాపై నియంత్రణ, ధనబలంతో...తాజా ఎన్నికల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో మతతత్వశక్తులు మరింత బలోపేతమయ్యాయని తెలిపింది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా హిందూత్వ రాజకీయాల ఆధిపత్యం పెరిగిందని, దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పొలిట్‌బ్యూరో శని, ఆదివారం రెండు రోజులపాటు సమావేశమై చర్చించింది. త్రిపురలో చెలరేగిన రాజకీయ హింసను పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. పంజాబ్ ఓటర్లు రెండు సాంప్రదాయక పార్టీలైన కాంగ్రెస్, అకాలీదళ్‌లను తిరస్కరించారు. వారు నిర్ణయాత్మక మార్పు కోసం ఓటు చేయడంతో ఆప్ స్వీప్ చేసింది. మితవాద రాజకీయాలు తమ ఆధిక్యతను కొనసాగిస్తున్నాయనడానికి ఈ ఫలితాలు ఒక నిదర్శనం. ఈ పరిస్థితుల్లో హిందూత్వ, కార్పొరేట్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ రెట్టించిన పట్టుదలతో పోరాడాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. త్రిపురలో సీపీఐ(ఎం), అనుబంధ సంస్థల కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చోటుచేసుకున్నాయి. దీనివెనుక అధికార బీజేపీ హస్తముందని సీపీఐ(ఎం) ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవటం గమనార్హం. సీపీఐ(ఎం) కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకొని కాషాయమూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ తరహా దాడులతో, హింసతో సీపీఐ(ఎం)ను దెబ్బకొట్టాలని గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అవే ప్రయత్నాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..ఈపీఎఫ్ వడ్డీరేట్ను తగ్గించటాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. కార్మికశక్తిపై మోడీ సర్కార్ దాడి మరింత ఉధృతమైందని పేర్కొన్నది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.
మైనార్టీలను లక్ష్యంగా చేసుకున్న ఆర్ఎస్ఎస్
మైనార్టీ ముస్లింలే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ వార్షిక నివేదిక-2022 విడుదలైంది. ''రాజ్యాంగం, మత స్వేచ్ఛ పేరుతో దేశంలో మతపరమైన కలలు పెరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాలంటే ఒక వర్గం వారి సంఖ్య ప్రభుత్వరంగంలో పెరగాల్సిన అవసరముంది. ఇందుకోసం హిందూత్వ శక్తులు మరింత సంఘటితం అవ్వాలి''అని ఆర్ఎస్ఎస్ తన వార్షిక నివేదికలో పేర్కొన్నది. దేశంలో మతోన్మాదం పెచ్చుమీరే ప్రమాదం ఉందనడానికి ఆర్ఎస్ఎస్ వార్షిక నివేదిక తాజా ఉదాహరణ. ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తుల్ని ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఒక్కటవ్వాల్సిన అవసరముందని పొలిట్‌బ్యూరో భావిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం, దేశ సమగ్రత, శాంతి సామరస్యాల కోసం పోరాడాలని కోరుతోంది.