Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డంగా అమ్మేసి.. పంచుకున్న పెద్దలు
- గుట్టుగా సాగుతున్న దందా వెలుగులోకి..
- మోడీ సొంతరాష్ట్రంలో నల్ల బంగారం అక్రమార్జన
న్యూఢిల్లీ-నవతెలంగాణబ్యూరో
దారిమళ్లిన 60 లక్షల టన్నులు.. 6వేల కోట్ల కుంభకోణం
సామాన్యుడు పొద్దున లేచినప్పటినుంచి ఈ పూట గడిచేదెలా అని ఆలోచిస్తుంటే.. దోచుకునే వాడు మాత్రం దర్జాగా దోచుకుంటూనే ఉన్నాడు. వందలు వేలు కాదు... కోట్లు కొట్టేస్తున్నారు. మాకు అధికారమివ్వండి..అవినీతి ఊడలు పెకిలిస్తామన్న మోడీ సొంత రాష్ట్రంలోనే అతిపెద్ద బొగ్గు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విచిత్రంగా గుజరాత్‌కు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు ఈ కుంభకోణం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఓ పాత్రికేయుడికి వచ్చిన ఈ చిన్న సందేహం ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. దాదాపు రూ.6 వేల కోట్ల విలువగల ఈ కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతూ, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తున్నట్టు నకిలీ ధృవపత్రాలు సృష్టించి, వాటిని పలు ఏజెన్సీల ద్వారా రూటు మార్చి, ప్రయివేటు విపణిలో అధిక ధరలకు విక్రయించి, సర్కారు ఆదాయానికి గండికొట్టిన ప్రభుత్వ పెద్దల భాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కోల్ ఇండియాకు చెందిన వివిధ బొగ్గు గనుల నుంచి వెలికితీసిన బొగ్గు ..చేరాల్సిన పరిశ్రమలకు చేరలేదు. సుదీర్ఘకాలంగా ఇక్కడి నుంచి బొగ్గు మాయమవుతున్నది. చిన్న ఆధారాన్ని పట్టుకొని దీనిపై ఓ జాతీయ మీడియా విచారణను చేపట్టింది. బొగ్గు గనుల అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, సరఫరా చేయించుకుంటున్నామని జాబితాల్లో పేర్కొన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానుల్ని, మధ్య దళారులుగా పనిచేస్తున్న ఏజెన్సీల ఉద్యోగులు సహా పలువురిని ఆ మీడియా సంస్థ సంప్రదించింది. కోల్ ఇండి యా సహా ఇతర ప్రభుత్వ శాఖలు దీనిపై నోరుమెదిపేందుకు సాహసిం చలేదు. 'అవునా...మా దృష్టికి రాలేదే...నో కామెంట్' అని మాత్రమే వ్యాఖ్యలు చేశారు.
60 లక్షల టన్నుల బొగ్గు స్వాహా...
కోల్ ఇండియా గనుల నుంచి దాదాపు 60 లక్షల టన్నుల బొగ్గును చిన్న పరిశ్రమల పేరుతో అక్కడ రింగ్‌గా ఏర్పడిన కొందరు వ్యాపారులు డ్రా చేశారు. టన్ను సగటు ధర రూ.మూడు వేలు చొప్పున, ఈ బొగ్గుకు రూ.1800 కోట్లకు కొల్లగొట్టారు. ఇతర రాష్ట్రాలకు ఈ బొగ్గును రవాణా చేయడానికి అనేక డమ్మీ, మిస్సింగ్ ఏజెన్సీలను పుట్టించి, వాటిపేరుపైనే వే బిల్లులు సృష్టించారు. తప్పుడు బిల్లుల ద్వారా రాష్ట్ర సరిహద్దులు దాటించి, అదే బొగ్గును టన్ను రూ.8 వేలు నుంచి 10 వేల వరకు విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. ఆ మధ్య దేశంలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయనీ, ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దళారీ ఏజెన్సీలు కృత్రిక కొరతను సృష్టించి భారీగా జాతీయ సంపదను కొల్లగొట్టినట్టు ఆ జాతీయ మీడియా సంస్థ ఆధారాలతో నిరూపించింది. ఈ కుంభకోణం వెనుక గుజరాత్ ప్రభుత్వంలోని కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్టు స్పష్టమవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ జైన్‌ను సంప్రదించగా.. రాష్ట్ర ప్రభుత్వం (ఎస్ఎన్ఎ) నియమించిన ఏజెన్సీలకు బొగ్గు ఇస్తున్నామనీ, అవి ఉన్నాయో లేదో తమకు తెలీదని ఆయన చెప్పడం గమనార్హం. తమ పాత్ర ఆ ఏజెన్సీలకు పంపడం వరకే తమ పని అనీ, ఆ ఏజెన్సీలను రాష్ట్ర ప్రభుత్వంలోని పరిశ్రమల శాఖే నియమించిందని చెప్పుకొచ్చారు. దీనిపై గుజరాత్ పరిశ్రమల శాఖ అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని కోల్ఇండియా డైరెక్టర్ సత్యేంద్ర తివారీ చెప్పారు. దీనిపై ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్ర హౌం శాఖ దృష్టికి ఆధారాలతో తీసుకువెళ్ళండని సూచించారు.
ఈ కుంభకోణం వెనుక..!
దేశవ్యాప్తంగా చిన్న పరిశ్రమలకు సరసమైన ధరలకు నాణ్యమైన బొగ్గును అందించేందుకు 2007లో కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. 2008 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ విధానం ప్రకారం, గుజరాత్‌లోని చిన్న పరిశ్రమల కోసం కోల్ ఇండియాకు చెందిన వెస్టర్న్ కోల్ ఫీల్డ్, సౌత్-ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ నుంచి ప్రతి నెలా బొగ్గును వెలికి తీస్తోంది. ఈ బొగ్గును ఎవరెవరికి, ఎంతెంత సరఫరా చేయాలో అక్కడి రాష్ట్ర పరిశ్రమల శాఖ కోల్ ఇండియాకు నామినేటెడ్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ)ల జాబితాను పంపుతుంది. ఈ జాబితాల్లోని ఏజెన్సీల రవాణా, ఖర్చులో 5 శాతం సేవా పన్నుగా వసూలు చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. ఈ చిన్న లొసుగు ఆధారంగా కోల్ ఇండియా బొగ్గును ఏజెన్సీల పేరుతో బ్లాక్ మార్కెట్ చేసి లూటీ చేసేశారు. కోల్ ఇండియాకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ లూటీని కొనసాగించేశారు.
ఇలా వెలుగులోకి...
దీనిపై విచారణ జరిపిన జాతీయ మీడియా సంస్థ గుజరాత్ ప్రభుత్వం కోల్ ఇండియాకు ఇచ్చిన జాబితాలోని గుజరాత్ కోల్ కోక్ ట్రేడ్ అసోసియేషన్ ఏజెన్సీ డైరెక్టర్ అలీ హస్నైన్ దోసానిని సంప్రదించింది. తాము దక్షిణ గుజరాత్‌లోని టెక్స్టైల్ పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలిపారు. వీరి సరఫరా జాబితాలో సౌత్ గుజరాత్ టెక్స్టైల్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఉంది. దాని యజమాని జితేంద్ర వఖారియా మాట్లాడుతూ తాము 45 ఏండ్లుగా వ్యాపారం చేస్తున్నామనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తామెప్పుడూ బొగ్గును తీసుకోలేదని చెప్పారు. అలాగే మరో కొనుగోలుదారుగా జాబితాలో ఉన్న షిహౌర్ ఇండిస్టీస్, జై జగదీష్ ఆగ్రో ఇండిస్టీస్‌ను లబ్దిదారుగా చూపారు. ఈ పరిశ్రమల యజమాని జగదీష్ చౌహాన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు బొగ్గు వస్తున్న విషయమే తెలీదన్నారు. ఇప్పటి వరకు తమను ఎవరూ ఈ విషయంలో సంప్రదించలదేని చెప్పారు. తాము స్థానిక మార్కెట్ నుంచే బొగ్గును కొనుగోలు చేస్తున్నామనీ తెలిపారు. మరో కొనుగోలుదారుగా ప్రభుత్వ జాబితాలో ఉన్న ఏ అండ్ ఎఫ్ డీహైడ్రేటెడ్ ఫుడ్స్‌కు చెందిన షాను బాదామి కూడా ఇదే తరహాలో సమాధానం చెప్పడం గమనార్హం.
అన్నీ నకిలీలే..
గుజరాత్ ప్రభుత్వం నియమించిన ఏజెన్సీల చిరునామాల్లో అసలు ఆ కంపెనీలే లేకపోవడం మరో విచిత్రం. కతియావార్ కోల్ కోక్ కన్స్యూమర్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ అనే ఏజెన్సీ సీజీ రోడ్‌లోని ఓ ప్రయివేటు ప్రాంగణంలో ఉన్నట్టు రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్‌ను ఇచ్చింది. కానీ ఆ చిరునామాలో నాలుగేండ్లుగా అక్కడ ఓ చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయం ఉంది. ఈ భవన సముదాయం నిర్మించక ముందు అక్కడో పత్రికా కార్యాలయం ఉండేదని విచారణలో తేలింది. గుజరాత్ కోల్ కోక్ ట్రేడ్ అసోసియేషన్ అనే ఏజెన్సీ అహ్మదాబాద్‌లోని ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్నట్టు అడ్రస్ ఇచ్చింది. కానీ అక్కడ ఆ కార్యాలయం లేదు. అక్కడ 'బ్లాక్ డైమండ్' అనే ట్రేడింగ్ ఏజెన్సీ ఉంది. ఇది కూడా బొగ్గు వ్యాపారానికి సంబంధించినదే. అలాగే సౌరాష్ట్ర బ్రిక్ వెయిటింగ్ అనే కంపెనీ సీజీ రోడ్ అడ్రస్లోఉంది. కానీ ఇక్కడ ఓ ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయం ఉంది.
గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా లింకులు..
కోల్ ఇండియా నుంచి గుజరాత్‌లోని లబ్దిదారుల పరిశ్రమల పేరుతో ఏజెన్సీలు ప్రతి ఏటా బొగ్గును కొనుగోలు చేస్తుంటాయి, కానీ ఇక్కడి.. ఏజెన్సీలు లబ్దిదారులకు ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు బొగ్గును విక్రయించడం ద్వారా వేలకోట్లు దండుకుంటున్నాయి. ఈ నల్లబంగారం దందాకు అవసరమైన నకిలీ బిల్లులను ఏజెన్సీలు సృష్టించి ఆదాయపు పన్ను, సేల్స్ ట్యాక్స్ , జీఎస్టీని కూడా ఎగ్గొట్టేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
గుజరాత్ ప్రభుత్వం పైనా అనుమానాలు..
బొగ్గు పంపిణీ, సరఫరాలో పారదర్శకత కోసం కోల్ ఇండియా వెబ్సైట్ కచ్చితమైన, ధ్రువీకరించబడిన సమాచారాన్ని అందించాలి. కోల్ ఇండియాకు తప్పుడు సమాచారాన్ని గుజరాత్ పెద్దలే ఇచ్చినట్టు అర్థమవుతుంది. బొగ్గును బ్లాక్‌మార్కెట్ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు అవసరమైన వారికి అమ్మేయడమే ఈ కుంభకోణం వెనుకున్న అతిపెద్ద ఆర్థిక నేరం. కోల్ ఇండియా వెబ్సైట్లో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే బొగ్గు పరిమాణం, సంబంధిత ఏజెన్సీ/కార్యాలయం పూర్తి పేరు, టెలిఫోన్ నెంబర్, ఈ మెయిల్ చిరునామా వంటివి ధృవీకరించి ఉండాలి. కానీ కోల్ ఇండియా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కాలమ్‌లో ఏజెన్సీ పేరు ''నేను ఏబీసీడీ, ఏఎస్డీఎఫ్, 999999999 అని రాసి.. నా విధిని పూర్తి చేసా'' అని ఉంది. ఈ కుంభకోణంలో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన రాజకీయనేతలు, కొందరు అధికారుల ప్రమేయం స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తున్నదని ఆ జాతీయ మీడియా సంస్థ పేర్కొన్నది.