Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవాడలో జరగనున్న మహాసభలు
- మహాసభ మార్గదర్శకాలకు జాతీయ కౌన్సిల్ ఆమోదం
- కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు మద్దతు
- సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూఢిల్లీ : సీపీఐ 24వ పార్టీ కాంగ్రెస్ అక్టోబర్ 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు విజయవాడలో జరగనున్నదనీ, ఆ మహాసభకు సంబంధించిన మార్గదర్శకాలను తమ పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదించిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని, ఎన్‌ఏఎల్‌సీఓ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈపీఎఫ్ వడ్డీ రేటు కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఢిల్లీలోని అజరు భవన్లో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన మూడు రోజుల సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులపై సంక్షిప్త నివేదికను కౌన్సిల్ ఆమోదించిందని తెలిపారు. ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఆందోళన కలిగించాయని అన్నారు. తమ పార్టీ దేశంలోని అన్ని వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు, శక్తులతో కూడిన ఐక్య వేదికకు అంగీకరించిందని, అన్ని లౌకిక, ప్రజాస్వామ్య ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఫలితాల నుంచి సరైన పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలోపు అర్థవంతమైన, తీవ్రమైన ఆత్మపరిశీలన చేయాలని అన్నారు.
ఆర్ఎస్ఎస్-బీజేపీ కలయికతో మతపరమైన విభజన, నియంతృత్వ దాడుల నుంచి దేశ రిపబ్లిక్, రాజ్యాంగం, దేశాన్ని రక్షించడానికి ఉమ్మడి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని అన్ని ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు జాతీయ కౌన్సిల్ విజ్ఞప్తి చేసిందన్నారు.
ఆర్ఎస్ఎస్-బీజేపీ సమ్మేళనంపై ఐక్యత సాధించాలంటే అన్ని పార్టీలు పరస్పరం అనుకూలంగా ఉండాలని సూచించారు. 2014లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రజా వ్యతిరేక దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన తక్షణ అవసరమని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలన కేంద్రీకరణ, ఏకదిశాత్మక ధోరణులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతలో వామపక్షాలు అంతర్భాగంగా ఉంటాయని తెలిపారు. సీపీఐ, వామపక్షాలు విస్తృత ప్రజాస్వామ్య, లౌకిక, ఫాసిస్ట్ వ్యతిరేక ఫ్రంట్‌ను రూపొందించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయని అన్నారు. అటువంటి ఐక్య ఫ్రంట్ బలమైన సామూహిక చర్యల ద్వారా మాత్రమే ఉద్భవించగలదని చెప్పారు. మెజారిటీ ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, టీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, శివసేన తదితర పార్టీలు కేంద్ర ప్రభుత్వం, దాని ఏకీకృత వైఖరిపై నిరంతరం గళం విప్పుతున్నాయని, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం, రాష్ట్రాలకు సరైన ఆర్థిక సాయం అందించకపోవడం వంటి అంశాలపై తాము నిరసిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఫెడరల్ వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా స్వరం పెంచడంలో కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ముందంజలో ఉందని అన్నారు.