Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ బడ్జెట్ ఆమోదం పొందింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు 2022-23 సంవత్సరానికి గాను రూ.1.42 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి తగిన సమయం ఇవ్వాలనే ప్రతిపక్షాల డిమాండ్ చేశాయి. 2021-22 సంవత్సరానికి కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకాశ్మీర్ కోసం మొత్తం రూ.18,860.32 కోట్ల అనుబంధ డిమాండ్లను కూడా సమర్పించారు. దీనిపై సభను చర్చను చేపట్టడానికి అనుమతించడానికి కొన్ని నిబంధనలను నిలిపివేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని సమర్పించారు. దీనిపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరలేకపోయిందని, దాని పూర్తి రాష్ట్ర హౌదాను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు.
పర్యాటక రంగంలో 21.5 మిలియన్ల మంది
ఉద్యోగాలు ఊస్ట్
కరోనా కారణంగా పర్యాటక పరిశ్రమలో దాదాపు 21.5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోవిడ్ -19 మొదటి వేవ్ సమయంలో దేశంలో పర్యాటకుల రాక 93 శాతం తగ్గిందని, రెండవ వేవ్‌లో 79 శాతం, మూడవ వేవ్‌లో 64 శాతం తగ్గిందని ఆయన చెప్పారు. ''పర్యాటకంపై మహమ్మారి ప్రభావంపై మేము ఒక అధ్యయనం చేసాము. అధ్యయనం ప్రకారం మొదటి వేవ్‌లో 14.5 మిలియన్ల ఉద్యోగ నష్టాలు, రెండవ వేవ్‌లో 5.2 మిలియన్ల ఉద్యోగ నష్టాలు, మూడవ వేవ్‌లో 1.8 మిలియన్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి'' అని తెలిపారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు : పార్లమెంట్ కమిటీ
పార్లమెంటరీ ప్యానెల్ అన్ని సమయాల్లో 100 శాతం సిబ్బందిని నిర్ధారించాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ''చాలా దయనీయమైన వ్యవహారాలు''గా పేర్కొంది. మంత్రిత్వ శాఖలోని అన్ని సంస్థలలోనూ ఇదే పరిస్థితి ఉందని కమిటీ గమనించింది. ఆర్కియాలిజీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ఆర్కియాలజీ కేడర్‌లో మొత్తం 420 పోస్టులు మంజూరు కాగా, అందులో 166 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
కన్జర్వేషన్ కేడర్‌లో 918 మంజూరు పోస్టులు కాగా, అందులో 452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. కొన్ని కేడర్లలో మంజూరైన పోస్టులు కంటే 50 శాతం ఎక్కువ ఖాళీలు ఉన్నట్లు గుర్తించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. ఆరు నెలల వ్యవధిలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన అన్ని ఖాళీ పోస్టులను, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను ఏడాదిలోగా భర్తీ చేయాలని మంత్రిత్వ శాఖకు కమిటీ సిఫారసు చేసింది.