Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని విధాలుగా రష్యాతో కటీఫ్ చేసుకోవాలని ఒత్తిడి
- భారత్, చైనాలతో అధికారికంగా, ప్రయివేట్‌గా చర్చలు!
- భారత్ తన ప్రయోజనాలు తాను చూసుకోవాలి..
- అమెరికా వలలో చిక్కుకోవద్దు: రాజకీయ విశ్లేషకులు
ఉక్రెయిన్ భుజాలపై తుపాకి పెట్టి రష్యాను కాల్చడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. రష్యాను దెబ్బకొట్టడానికి అమెరికా ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడింది. దాని ఫలితమే నేడు ఉక్రెయిన్ సంక్షోభం. ఆసియాలో అమెరికా చేసిన కుట్ర 'క్వాడ్' (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్) కూటమి ఏర్పాటు. చైనాను లక్ష్యంగా చేసుకొని ఈ కూటమిని ఏర్పాటుచేసింది. అమెరికా తన స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేస్తుందని చరిత్ర చెబుతోంది. ఈనేపథ్యంలో భారత్ తనదైన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఎంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ అమలవుతున్న మన విదేశాంగ విధానంలో దారుణమైన లోపాలున్నాయి. వీటిని సవరించుకోవాలంటే..ముందుగా 'క్వాడ్' నుంచి భారత్ వైదొలగాలని వారు అన్నారు. .
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ సంక్షోభం..భారత్‌కు కొత్త సవాళ్లు విసురుతోంది. ముఖ్యంగా అమెరికా బెదిరింపు ధోరణి మరింత పెరిగింది. రష్యాకు దూరం జరగాలని భారత్, చైనాలకు హెచ్చరికలు జారీచేస్తోంది. సోమవారం రోమ్‌లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవాన్స్, చైనా దౌత్యవేత్త యాంగ్ జిచీ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశం కంటే ముందు ఆదివారం సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేక్ సల్లీవాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''బీజింగ్‌లో చైనా నాయకత్వంతో మేం నేరుగా మాట్లాడుతున్నాం. ప్రయివేట్గానూ చర్చలు జరుపుతున్నాం. తెరవెనుకగా రష్యాకు సహాయ సహకారాలు అందిస్తే ఊరుకోమని తెలియజేశాం. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తాం. ఈ ఆంక్షల నుంచి రష్యాను బయటపడేయటం కోసం ఏ దేశమూ సాయం చేయరాదు''అంటూ చైనాను ఉద్దేశించే జేక్ సల్లివాన్స్ చెప్పారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.జేక్ సల్లివాన్స్ చేసిన వ్యాఖ్యలు కేవలం చైనాకే కాదు..భారత్‌కూ వర్తిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రష్యాతో అన్నివిధాల సంబంధాలూ తెగతెంపులు చేసుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి మరింత పెరిగింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని భారత నాయకత్వాన్ని బెదిరిస్తోంది. ఈనేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా సరిహద్దుల్లో తలెత్తుతున్న సమస్యలు, ఇతర రక్షణ అంశాలపై చర్చించడానికి ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో 'కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ' (సీసీఎస్) భేటీ జరిగింది. భారత సైనిక బలగాల సన్నద్ధత, వైమానిక, నావికా దళాల మోహరింపులు ..వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
రష్యా నుంచి ఆఫర్
ఇదిలా ఉండగా..ఆంక్షల నేపథ్యంలో
రష్యా ఉన్నతాధికారులు భారత్‌తో వాణిజ్య, రక్షణ సంబంధాల కొనసాగింపును మరింత బలోపేతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల వద్ద కాకుండా, తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేయగల మని రష్యా ఇంధనశాఖ మంత్రి భారత్‌కు గొప్ప ఆఫరు కూడా ఇచ్చారు. అంతేకాదు రష్యా చమురు, సహజవాయు క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.. అంటూ భారతీయ కంపెనీలకు ఆహ్వానం కూడా పలి కాడు. ముడి చమురు ధరలు 130 డాలర్లు దాటుతు న్నవేళ రష్యా నుంచి వచ్చిన ఆ ఆఫర్ బంగారం లాంటి అవకాశమని నిపుణులు అభిప్రాయ పడ్డారు. భారత్ తన అవసరాల్ని, ప్రయోజనాల్ని చూసుకో వాలని, అమెరికా చెప్పినట్టు తలాడించి.. రష్యాను దూరం చేసుకోకూడదని వారు సూచిం చారు. గతంలో ఇలాగే అమెరికా మాట విని ఇరాన్‌ను భారత్ దూరం చేసుకుందని గుర్తుచేస్తున్నారు.
మాట వినేలా చేద్దాం..
రష్యాతో తెగతెంపులు చేసుకోవాలని, ముడి చమురును ఎట్టి పరిస్థితులో రష్యా నుంచి కొనుగోలు చేయరాదని భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగింది. ఈ విషయంలో మోడీ సర్కార్ తమ మాట వింటుందన్న నమ్మకం అమెరికా నాయకత్వంలో కనపడుతోంది. భారత్‌లో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, మోడీ సర్కార్‌లో కొంతమందికి కార్పొరేట్ ప్రయోజనాలు, మరికొంత మందికి రాజకీయ ప్రయోజనాలున్నాయని, ఈ లొసుగుల్ని ఆధారంగా చేసుకొని భారత్ మెడలు వంచటం ఏమంత కష్టం కాదని అమెరికా భావిస్తోందట!
మన విదేశాంగ విధానం మారాలి!
ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధం, అశాంతి నిరంతరం సాగటం అమెరికాకు ఇష్టం. తద్వారా తన ఆధిపత్యాన్ని, ఆయుధాల వ్యాపారాన్ని పెంచుకోవటం అమెరికా లక్ష్యం. మన్మోహన్ పాలనలో భారత్..అమెరికాకు దగ్గరైంది. మోడీ సర్కార్ వచ్చాక అది మరింత వేగవంతమై మన విదేశాంగ విధానంలో అనూహ్య మార్పులకు దారితీసింది. ఉదాహరణకు ఇరాన్ విషయంలో, ఆ దేశం నుంచి ముడి చమురు కొనవద్దని అమెరికా చెబితే..మోడీ సర్కార్ తలాడించింది. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా, పాలస్తీనాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంలో ఓటేసింది.
ముడి చమురు కొనుగోలులో..తమకు డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు, ఆహార ఉత్పత్తులు సరఫరా చేసినా చాలు, రూపాయిల్లో చెల్లింపులు చేసినా ఫరవాలేదు..అని ఇరాన్ ముందుకు వచ్చినా, భారత్ తిరస్కరించింది. భారత్ తన స్వీయ ప్రయోజనాలు అమెరికాకు తాకట్టు పెట్టినందువల్లే ఇలాంటి ధోరణి నెలకొందని..మన విదేశాంగ విధానంపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? అనేది చర్చనీయాంశమైంది. ఇరాన్‌తో తెగతెంపులు చేసుకున్నట్టు, రష్యాతోనూ చేస్తారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.