Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 11 నుంచి 17 వరకు ఆందోళన
- లఖింపూర్‌ఖేరీ ఘటనలో రైతులకు ద్రోహంపై
- ఈ నెల 21న దేశవ్యాప్త నిరసనలు
- మార్చి 28, 29 కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు
- సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం
న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. సోమవారం నాడిక్కడ గాంధీ పీస్ ఫౌండేషన్‌లో ఎస్కేఎం అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ఎంఎస్పీ లీగల్ గ్యారెంటీ వీక్ (కనీస మద్దతు ధర చట్టబద్ధ హామీ వారం)ను ఏప్రిల్ 11 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వారంలో సంయుక్త కిసాన్ మోర్చా అనుబంధ సంఘాలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా రైతులందరికీ వారి వ్యవసాయ ఉత్పత్తులపై కనీస మద్దతు ధర (సి2+50శాతం) చట్టబద్ధమైన హామీని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ప్రదర్శనలు, సెమినార్లు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో లఖింపూర్‌ఖేరీ కేసులో జరుగుతున్న న్యాయ ప్రక్రియను సమీక్షించిన అనంతరం పోలీసు యంత్రాంగం, న్యాయవాదులు కలిసి నేరస్తులను రక్షించి, అమాయక రైతులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్కేఎం ఆందోళన వ్యక్తంచేసింది. ఇంతటి సీరియస్ కేసులో కేంద్రమంత్రి కుమారుడికి ఇంత త్వరగా బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగించే అంశమని పేర్కొంది. ఆశిష్ మిశ్రా విడుదలైన తర్వాత కేసులో కీలక సాక్షిపై దాడి జరిగిందన్న వార్తలపై ఎస్కేఎం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో న్యాయ పోరాటంలో ఎలాంటి సడలింపు ఉండదనీ, రైతుల కుటుంబాలకు ఎస్కేఎం పూర్తి న్యాయ సహాయం అందజేస్తామని స్పష్టం చేసింది.
డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను ఎస్కేఎం సమీక్షించిందనీ, మూడు నెలల తర్వాత కూడా ప్రభుత్వం తన కీలక హామీలపై చర్య తీసుకోలేదని తెలిపింది. ఎంఎస్పీపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన జాడలేదని, హర్యానా మినహా ఇతర రాష్ట్రాల్లో ఆందోళన సందర్భంగా రైతులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఉపసంహరించుకోలేదని గుర్తు చేసింది. ఢిల్లీ పోలీసులు కొన్ని కేసుల పాక్షిక ఉపసంహరణ గురించి మాట్లాడుతున్నారు.. కానీ దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసుల్లో ఏమీ జరగలేదని పేర్కొంది.
లఖింపూర్‌ఖేరీ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల ఉద్యమానికి ఇచ్చిన హామీలను ద్రోహం చేయడంపై మార్చి 21న దేశవ్యాప్త నిరసనను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. మార్చి 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు ఎస్కేఎం మద్దతు ఇస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా రైతులు సమ్మెలో చురుకుగా పాల్గొంటారని మోర్చా పునరుద్ఘాటించింది. సంయుక్త కిసాన్ మోర్చా సమన్వయ కమిటీ సమావేశంలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అసోం, త్రిపుర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, అశోక్ దావలే జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ (కక్కాజీ), యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఏపి రైతు సంఘం కార్యదర్శి మర్రాపు సూర్యానారాయణ, ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు.