Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో అంగన్వాడీలు, విఓఎలు, పంచాయతీ కార్మికుల అరెస్ట్
- భారీగా పోలీసులు మోహరింపు
అమరావతి : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరిగే ఏ ఒక్క ఆందోళననూ రాష్ట్ర ప్రభుత్వం సహించడం లేదు. ఊళ్లలోనే ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధాలకు, ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఏదోరకంగా నానా కష్టాలు పడి విజయవాడకు చేరుకున్న వారిని సైతం అడుగుముందుకు వేయనీయకుండా అడ్డుకుంటున్నారు. మంగళవారం ఆందోళనలు నిర్వహించిన అంగన్వాడీలు, విఓఎలు గ్రామపంచాయతీ కార్మికుల గొంతు నొక్కిన తీరే దీనికి నిదర్శనం. విజయవాడ సమీపంలోని టోల్‌ప్లాజాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండే ఈ అణచివేత ప్రారంభమైంది. అనుమానం వచ్చిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిని కూడా దాటుకుని లెనిన్‌సెంటర్, ధర్నా చౌక్‌లకు చేరిన వారిపై మరింత తీవ్రంగా నిర్బంధానికి దిగారు. పెద్దసంఖ్యలో మొహరించిన పోలీసులు సమస్యల పరిష్కారం కోసం నినదించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. ప్రతిఘటించిన వారిని నలుగురైదుగురు కలిసి వ్యాన్లలో కుక్కి అక్కడినుండి తరలించారు.
అడ్డంకులు అధిగమించిన అంగన్వాడీలు...
అంగన్వాడీలను విజయవాడకు రానీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులన్నింటిని అధిగమించి పలువురు అంగన్వాడీలు విజయవాడకు చేరుకున్నారు. వేతనాల పెంపు, రిటె ౖర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు ఇవ్వాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలని నినాదాలు చేస్తూ విజయవాడ ఏలూరురోడ్డు నుండి లెనిన్ సెంటర్‌కు ప్రదర్శన నిర్వహిం చారు. ఈ ప్రదర్శనకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి .బేబిరాణి, కె సుబ్బరావ మ్మ, రాష్ట్రకార్యదర్శి ఐ వేమేశ్వరి తదితరులు నాయకత్వం వహించారు. ప్రదర్శన లెనిన్ సెంటర్ వద్దకు రాగానే ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది.
మహిళా విఓఎలపై మగపోలీసుల జులం
కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరుతూ రాఘవయ్య పార్కు నుండి స్రదర్శన నిర్వహించిన విఓఎలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రదర్శనకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రూప, కె ధనలక్ష్మి నాయకత్వం వహించారు. వీరు బందరు రోడ్డు మీదకు రావడానికి ముందే పెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు అరెస్ట్ చేయడం కోసం రెండు బస్సులను సిద్దం చేసి ఉంచారు. అయినప్పటికీ విఒఎలు ప్రదర్శనకు ప్రయత్నం చేయడంతో పోలీసులు, విఒఎల మధ్య తోపుటాట పెద్దఎత్తున జరిగింది. మహిళా విఓఎలపై మగ పోలీసులు జులుం చేశారు. పోలీసులు అడ్డుపెట్టిన రోప్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రూప మెడకు బలంగా ఒత్తుకోవడంతో ఆమె గట్టిగా అరిచింది. అయినా పోలీసులు విడిచిపెట్టకుండా అరెస్ట్ చేసి పెనమలూరు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మార్గం మధ్యలో రూప మంచినీరు తాగలేని స్థితిలో ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. చివరికి ఆమె పరిస్థితి విషమించడంతో నాగార్జున ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. వైద్య చికిత్సల అనంతరం సాయంత్రం ఆమెను ఆస్పత్రి నుండి డిశ్చార్జి చేశారు. అరెస్టు చేసిన విఒఎలను పాయకాపురం, సింగ్‌నగర్, కృష్ణలంక, కంకిపాడు, పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌కు తరలించారు.
డిమార్ట్ వద్ద పంచాయతీకార్మికులు అరెస్ట్
ధర్నాచౌక్ రోడ్డులోని డిమార్ట్ వద్ద పంచాయతీ పారిశుధ్య కార్మికులు, ఎంప్లాయీస్, గ్రీన్ అంబాసిడర్లు తమకు వేతనాలు పెంచాలని కోరుతూ ప్రదర్శన చేశారు. యూనియన్ నాయకులు ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, వివిధ జిల్లాల నుండి వచ్చిన కార్మికులు ధర్నాచౌక్ వైపు కదలడంతో పోలీసులు మార్గం మధ్యలోనే ప్రదర్శనను అడ్డుకుని అరెస్ట్ చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె ఉమామహేశ్వరరావుతో పాటు మరికొంత మంది కార్మికులు, విఒఎలు, అంగన్వాడీలను తాడేపల్లి పోలీసులు ఉదయం 7.30గంటలకే అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రైతుసంఘం కార్యాలయ వాచ్మెన్పై ఎస్ఐ దాడి
గుంటూరుజిల్లా వడ్డేశ్వరంలోని ఎపి రైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘం, కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యాలయ వాచ్మెన్ అప్పలస్వామిపై తాడేపల్లి ఎస్ఐ రమేష్దాడి చేశారు. నాయకులను దాస్తున్నావు, వాళ్లు ఎక్కడున్నారో చెప్పడం లేదంటూ బూతులు తిడుతూ రోడ్డు మీదకు లాక్కొచ్చి కాలితో తన్నారు. సెల్‌ఫోన్‌ను పగులకొట్టారు. ఈ ఘటనలో అప్పలస్వామికి గాయాలయ్యాయి.