Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే దారిలో ఆయిల్ సీడ్స్, పప్పులు, జనపనార
న్యూఢిల్లీ : దేశంలో రైతు పండించిన పంట కొనుగోళ్లు తగ్గాయి. పత్తి, ఆయిల్ సీడ్స్, పప్పులు, జనపనార విషయంలో అదే జరిగింది. మంగళవారం లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎంఎస్పీ వద్ద పంట సేకరణ వివరాలు తెలిపారు. 2019-20లో 105.22 లక్షల మెట్రిక్ టన్నులు పత్తి కొనుగోలు చేయగా, 2020-21లో 91.90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 2019-20లో 15.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ సీడ్స్ కొనుగోలు చేస్తే, 2020-21లో 2.95 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. పప్పు ధాన్యాలు కూడా 2019-20లో 28.54 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, 2020-21లో కేవలం 8.16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. జనపనార 2019-20లో 0.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, 2020-21లో 0.04 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మరోవైపు ధాన్యం, గోధుమ వంటి సేకరణ కొద్దమేర పెరిగింది.
236 హిజ్రాలపై దాడులు... కేసులు నమోదు
దేశంలో 2020లో హిజ్రాలపై జరిగిన దాడులకు సంబంధించి మొత్తం 236 కేసులు నమోదు అయినట్టు కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా తెలిపారు. తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర హౌం సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం 236 కేసుల్లో, 10 మంది హత్య, 29 మంది ఆత్మహత్య, నిర్లక్ష్యం కారణంగా మరో 46 మంది మరణించగా, 61 మంది పై దాడులు జరిగినట్టు కేసులు నమోదు. హిజ్రాలను గాయపరిచిన కేసులు 185 కాగా, హిజ్రాలకు సంబంధించిన ఆస్తులకు వ్యతిరేకంగా జరిగిన నేరాలు 25 నమోదు అయ్యాయి.
రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు పరిహార అంశం రాష్ట్ర ప్రభుత్వాలదే
రైతు ఉద్యమంలో మరణించిన వారికి పరిహారం అంశం రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం తదితరాల అంశం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉందని పేర్కొన్నారు.