Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాదిమందితో పార్లమెంటుకు మార్చ్
- కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు
న్యూఢిల్లీ : ప్రాథమిక సేవా పథకాలైన ఐసీడీఎస్, మిడ్ డే మీల్, ఎన్హెచ్ఎంలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ స్కీమ్ వర్కర్లు కదంతొక్కారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది స్కీమ్ వర్కర్లు పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్), మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎండీఎండబ్ల్యూఎఫ్ఐ), ఆశా వర్కర్స్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ (ఏఐసీసీఏడబ్ల్యూ) నేతృత్వంలో మంగళవారం చలో పార్లమెంట్ నిర్వహించారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ప్రాథమిక సేవల పథకాలైన ఐసీడీఎస్, ఎండీఎంఎస్, ఎన్హెచ్ఎంలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలనీ, పెన్షన్ ఇవ్వాలనీ, స్కీమ్ వర్కర్లపై ప్రయోగించిన అణచివేత, తొలగింపు, క్రూరమైన ఎస్మా ప్రయోగం ఆపాలని నినదించారు. 14వ ఐఎల్సీ సిఫార్సులను అమలు చేయాలనీ, రూ.26 వేల కనీస వేతనం, రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్, ఎండీఎంఎస్, ఎన్హెచ్ఎంలను ప్రయివేటీకరణ చేయొద్దనీ, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రత చర్యలు చేపట్టాలనీ, కరోనాలో పని చేసిన స్కీమ్ వర్కర్లకు రిస్క్ అలవెన్సు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం సంఘీభావం తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లోనూ లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులపై క్రూరమైన ఎస్మా, అణచివేతను ఖండిస్తూ తీర్మానం ఆమోదించారు. కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన ఈ నెల 28,29 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 'జవాబుదారీ సమావేశాలు (జవాబ్దేహి)' నిర్వహించాలనీ, తగిన బడ్జెట్ కేటాయింపులు, కనీస వేతనాలు, పెన్షన్ డిమాండ్‌పై ఎంపీలందరినీ కలవాలని నిర్ణయించారు. డిమాండ్లు నెరవేర్చకుంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో 'పార్లమెంట్ ఎదుట పడావ్' చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జంతర మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడారు. ఈ కీలకమైన పథ కాలను, అందులో పనిచేసే కార్మికులు నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నారనీ, ఎన్డీఏ ప్రభుత్వం గత కేంద్ర బడ్జెట్లో (2021-22) ఐసీడీఎస్ కేటాయింపులో గతేడాది కంటే 30 శాతం, మధ్యాహ్నం భోజనం పథకం నిధులు రూ.1,400 కోట్ల కోత విధించిందని అన్నారు. ఈ ఏడాదీ ఎండీఎంఎస్కు బడ్జెట్ కేటాయింపులో రూ.1,200 కోత పెట్టిందనీ, ఎన్హెచ్ఎం కోసం బడ్జెట్ కేటాయింపులో పెరుగుదల లేదని తెలిపారు. ధరలు పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, బడ్జెట్ కేటాయింపుల్లో తగ్గుదల ఉందని, దీంతో నెలల తరబడి ఉన్న కొద్దిపాటి రెమ్యు నరేషన్ కూడా చెల్లించటంలేదని విమర్శించారు. ప్రస్తుతం, మన దేశంలోని మహిళలు, పిల్లలు ఆరోగ్యం, పోషకాహారం విషయంలో అత్యంత దుర్బలమైన స్థితిలో ఉందనీ, దేశం తన ప్రజలకు ఆరోగ్య సంరక్షణ, ఆహారాన్ని అందించడానికి మరింత ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు.
ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధూ మాట్లాడుతూ హర్యానాలో గత 100 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమ్మెతో పాటు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ మార్చ్ జరుగుతుందని అన్నారు. గత కొన్ని రోజులుగా పోరాడుతున్న స్కీమ్ వర్కర్లపై ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అణచివేత, ఎస్మాను ప్రయోగించాయని తెలిపారు. ఎంతటి అణచివేతను ప్రయోగించిన స్కీమ్ వర్కర్లు వెనక్కి తగ్గడంలేదని అన్నారు. ఈ ఆందోళనలో ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ అధ్యక్షురాలు ఉషారాణి, ఎండీఎండబ్ల్యూఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి జైభగవాన్, ఏఐసీసీఏడబ్ల్యూ నేత సురేఖ ప్రసంగించారు. పంజాబ్, హర్యానా ఢిల్లీ, యూపీకి చెందిన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ల నాయకులు హర్జీత్ కౌర్, సాజ్, సుర్జీత్, రాధ, బబిత, సరస్వతి, అమృత్, కమల, సునీత, నిరమల్, నీత, వీణా గుప్తా, సురేఖ, రోష్ని, అంజు తదితరులు ప్రసంగించారు.
ఎంపీలు ఎలమారం కరీం, ఎంఎ ఆరీఫ్ నేతృత్వంలో ఎఆర్ సింధూ, ఉషారాణి, దేవేంద్ర శర్మలతో కూడిన ప్రతినిధి బృందం కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీని కలిసింది. వేతనాలు పెంపు రాష్ట్ర ప్రభుత్వాలే చేయవలసి ఉందని, అయితే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కొన్ని సామాజిక భద్రతా పథకాలను ఖరారు చేసిందని కేంద్ర మంత్రి అన్నారు. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మన్సుఖ్ మాండవీయా, ధర్మేంద్ర ప్రధాన్లకు వినతి ప్రతాలు అందజేశారు.