Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక హైకోర్టు 'హిజాబ్ తీర్పు'పై మహిళా సంఘాలు
- న్యాయస్థానం తీర్పు ముస్లిం బాలికలను విద్య నుంచి దూరం చేస్తుందని ఆందోళన
న్యూఢిల్లీ : హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పుపై మహిళా సంఘాలు ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ తీర్పు హిజాబ్ ధరించే ముస్లిం బాలికలను విద్య నుంచి దూరం చేస్తుందని పేర్కొన్నాయి. ఈ మేరకు మహిళా హక్కుల కోసం పని చేసే సంస్థలకు చెందిన నాయకులు, పౌర సంఘాలు, సామాజిక సంస్థల కార్యకర్తలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఈ విషయం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలియజేయబడిన విషయాన్ని గుర్తు వారు చేశాయి. హిజాబ్ ధరించే ముస్లిం బాలికలు కాలేజీ, స్కూల్ యూనిఫామ్‌ల పేరుతో వివక్షకు గురికాకుండా, విద్యకు దూరం కాకుండా వారిని సుప్రీంకోర్టు రక్షిస్తుందన్న విశ్వాసం తమకున్నదని వివరించారు. యూనిఫామ్‌లకు సంబంధించిన నిర్ణయాలు చేసే హక్కు కాలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ (సీడీసీ)కు ఉన్నదని కర్నాటక హైకోర్టు తీర్పు గుర్తిస్తుందన్నారు. సాక్షాత్తు కర్నాటకలోనే యూనిఫామ్స్‌తో హిజాబ్‌లు ధరించొచ్చన్న అదనపు నిబంధనలను పలు కాలేజీలు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ విధంగా, హిందువులు సిందూరం, బొట్టు, తిలకాలు.. సిక్కులు టర్బన్లను ధరించనట్టుగానే బాలికలు, మహిళలు యూనిఫామ్‌తో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కర్నాటకలోని సీడీసీలను కోరుతున్నామన్నారు. వాస్తవానికి హిజాబ్ ధరించడాన్ని నిషేధించే నిబంధన కర్నాటకలోని ఏ ఒక్క కాలేజీలోనూ లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా సీడీసీలకు గుర్తు చేయాలనుకుంటున్నట్టు వివరించారు. హిందూత్వ అతివాద గ్రూపులే ప్రత్యేకించి హిజాబ్‌ను నిషేధించాలంటూ కాలేజీల్లో అలజడిని సృష్టించాయని ఆరోపించారు. '' కాలేజీలు, స్కూళ్లలో ఇలాంటి బెదిరింపులను పరిష్కరించడానికి ఇదే కర్నాటక హైకోర్టుకు అవకాశం కానీ, న్యాయస్థానం అలా చేయలేదు. కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును మేము కోరుతున్నాం'' అని వివరించారు. న్యాయస్థానం తీర్పు ముస్లిం మహిళలు, బాలికల భద్రత, విద్యా హక్కు, వారి గౌరవంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. '' హిజాబ్ ధరించే ముస్లిం బాలికలు బలవంతంగా తరగతులకు దూరం చేయబడ్డారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా వారు పరీక్షలకూ దూరమయ్యారు. కొందరు ముస్లిం మహిళా టీచర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. హిజాబ్ ధరించే బాలికలు, మహిళలను క్యాంపస్‌లలోకి రాకుండా నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం వెలువర్చిన ఉత్తర్వు దేశవ్యాప్తంగా విద్యాసంబంధిత యంత్రాంగాలను ఈ విషయంలో మరింతగా ప్రోత్సహించేలా ఉన్నది. కర్నాటక హైకోర్టు తీర్పు హేతువు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నది. అనేక అంశాలలో సంతృప్తికరంగా లేదు. తమ విద్యా, గౌరవం, స్వయం ప్రతిపత్తి హక్కు కోసం పోరాడుతున్నందుకు ముస్లిం విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం'' అని వివరించారు.
ఆలిండియా ప్రోగ్రెస్సివ్ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రెటరీ కవితా కృష్ణన్, ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ నుంచి మరియమ్ ధావలే, మాలిని భట్టాచర్యా, కృతి సింగ్, మైమూనా మొల్లా తో పాటు పలు మహిళా సంఘాలకు చెందిన నాయకులు, సామాజిక, పౌర హక్కుల కార్యకర్తలు, రచయితలు, పరిశోధకులు, ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేసినవారిలో ఉన్నారు.