Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఓకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున: సమీక్షించాలి : విజయన్
తిరువనంతపురం : బీమా దిగ్గజం ఎల్ఐసీలో వాటాలను విక్రయించేందుకు కేంద్రం తీసుకున్న చర్యపై కేరళ అసెంబ్లీ ఆందోళన వ్యక్తంచేసింది. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సంస్థను తమ వద్దే ఉంచుకోవాలని, ప్రయివేటుకు కట్టబెట్టొద్దని కోరుతూ కేరళ శాసనసభ బుధవారం ఏకగ్రీవ
తీర్మానాన్ని ఆమోదించింది. ఇన్సూరెన్స్ దిగ్గజాన్ని ప్రయివేటు సంస్థల ప్రయోజనాలకు వదిలేస్తే.. దేశానికి మేలు జరగదనీ, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణసమీక్షించాలని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ''ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా కేవలం 5 శాతం వాటాలు మాత్రమే విక్రయించబడతాయనీ, అది ప్రయివేటీకరణ కాదని ప్రచారంచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం తన చర్యను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోందని విజయన్ విమర్శించారు. అయితే షేర్ల విక్రయం ప్రయివేటీకరణ దిశగా తొలి అడుగు అనీ, అదే ప్రభుత్వ అసలు లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రయివేట్ కంపెనీల దోపిడీ నుంచి వాటాదారులను రక్షించడానికీ, దేశంలోని బలహీన వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలకు బీమా కవరేజీని విస్తరింపజేసే లక్ష్యంతో ఎల్ఐసీని జాతీయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయన్ గుర్తుచేశారు.
అలాంటి సంస్థను.. ఇప్పుడు పార్లమెంట్లో సమగ్ర చర్చకు, పరిశీలనకు అవకాశం ఇవ్వకుండా ప్రయివేటీకరణ చేస్తున్నారనీ, ఆర్థిక బిల్లులో చేర్చి కేంద్రం ఎల్ఐసీ చట్టాన్ని సవరిస్తున్నదని విమర్శించారు. సమాజ ప్రయోజనాల కోసం ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం రూ.36.76 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందనీ, ప్రయివేటీకరణతో ఇంత గొప్ప వనరులను దేశం కోల్పోతుందని విజయన్ తెలిపారు.