Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముడిపదార్థాల ధరలు పెరగటంతో చేనేత, హస్తకళలకు గడ్డుకాలం
- వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ 12శాతం విధించే ఆలోచనలో మోడీ సర్కార్
- ప్రత్యక్షంగా..పరోక్షంగా కోట్లాది మంది కార్మికులపై ప్రభావం
- పన్నులు పెంచుతారు తప్ప..చేనేతరంగాన్ని ఆదుకోరా : సామాజికవేత్తలు
న్యూఢిల్లీ : ఆర్థిక విధానాలా? కరోనా సంక్షోభమమా? కారణాలేమైనా..మనదేశంలో వస్త్ర పరిశ్రమ (టెక్ట్స్‌టైల్) దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇది చాలదన్నట్టు వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ 5శాతం నుంచి 12శాతం పెంచడానికి మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. చేనేత కార్మికులు, కళాకారులు పెద్ద ఎత్తున ప్రభావితం అవుతారని అన్ని వైపుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నా..మోడీ సర్కార్ పట్టించుకోవటం లేదు. జీవనోపాధి కోసం మగ్గాలు నడుపుకుంటున్న కార్మికులు, చేనేత, హస్త కళల కార్మికుల బతుకులు ఆగమవుతాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. చేనేత రంగాన్ని నిలబెట్టడానికి కేంద్రం ప్రత్యేకంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. పన్ను పెంపు ప్రతిపాదనను పరిశ్రమ వర్గాలు, అనేక రాష్ట్రాలు సైతం వ్యతిరేకించాయి. ముడి పదార్థాల ధరలు పెరగటం, ప్యాకేజింగ్, సరుకు రవాణా ఖరీదుగా మారటం..ఎంతోమంది చేనేత కార్మికులు, కళాకారుల జీవితాల్ని తలకిందులు చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పన్నులూ పెంచితే కొన్ని లక్షల పవర్‌లూమ్స్, హ్యండ్లూమ్స్ యూనిట్లు మూలనపడే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నోట్లరద్దుతో మొదలు
చేనేత, హస్త కళల పరిశ్రమను 2016లో నోట్లరద్దు దెబ్బతీయగా, అటు తర్వాత జీఎస్టీ అమలు..ఉత్పత్తి ఖర్చు పెంచింది. వస్త్ర
తయారీలో ఇన్పుట్ వ్యయం అనూహ్యంగా పెరగటం మొదలైంది. దాంతో పరిశ్రమ మెల్లమెల్లగా సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇది చాలదన్నట్టు కరోనా సంక్షోభం తలెత్తింది. ఒక్కసారిగా కోట్లాది మంది ఉపాధి గల్లంతయ్యాయి. ఇంతటి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నా మోడీ సర్కార్‌లో మాత్రం చలనం రావటం లేదు. వస్త్ర తయరీ రంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేయటం లేదని పరిశ్రమ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిపై సామాజికవేత్తలు, ఎన్జీవోలు సర్వే చేయగా, తమ వస్త్ర అమ్మకాలు తగ్గిపోయాయని 75శాతం మంది కార్మికులు చెప్పారు. తమ ఆర్డర్లు రద్దు అయ్యాయని ప్రతి 10మంది కార్మికుల్లో 8మంది చెప్పారు. మోడీ సర్కార్ ఏకపక్షంగా ప్రకటించిన లాక్డౌన్ ఫలితం ఇది. తమ పని మధ్యలో ఆగిపోయిందని, డైయింగ్ కోసం తీసుకొచ్చిన రంగులు, ముడి పదార్థాలు వృధా అయ్యాయని కార్మికులు ఎంతగానో వ్యధ చెందారు. అయినా వారి బాధలు, కష్టాలు కేంద్రానికి కనిపించటం లేదని అర్థమవుతోంది. పన్ను పెంపు ద్వారా కేంద్రం తన ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి సిద్ధమవుతోంది.
కార్మికుల జీతాల్లో కోత
వివిధ పట్టణాలు, నగరాల్లో వస్త్ర తయారీ యూనిట్లలో దాదాపు 70లక్షల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ సమయంలో, అటు తర్వాత..యాజమాన్యాలు కార్మికుల జీతభత్యాలు గణనీయంగా తగ్గించాయి. పెరిగిన ఇన్పుట్, పెట్టుబడి వ్యయాలను తట్టుకోవడానికి కార్మికుల జీతభత్యాల్లో కోతలు విధించాయి. ఇదంతా తెలిసి కూడా కేంద్రం ఏమీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. హ్యాండ్లూమ్ డే, గాంధీ జయంతి.. సందర్భంగా పాలకులు కొన్ని ప్రకటనలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.