Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టుకు మహిళా సంఘాల నేతలు, కార్యకర్తల విజ్ఞప్తి
న్యూఢిల్లీ : ముస్లిం బాలికలు హిజాబ్‌ను ధరించడం మతపరంగా తప్పనిసరి కాదంటూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముస్లిం బాలికలు చదువుకు దూరమవుతారని, కాబట్టి ఈ ఉత్తర్వులపై వెంటనే స్టే విధించాలంటూ పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు సుప్రీం కోర్టును కోరాయి. బుధవారం ఈమేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై సంతకం చేసినవారిలో ఐద్వానేతలు మరియం ధావలె, మాలిని భట్టాచార్య, అడ్వకేట్ కీర్తి సింగ్, మైమూనా మొల్లా, సహేలి వుమెన్స్ రీసోర్స్ సెంటర్‌కి చెందిన సత్నామ్ కౌర్, సవితా శర్మ, అషిమా రారు చౌదరి, ఎన్ఎఫ్ఐడబ్ల్యు నేతలు అనీ రాజా, సిద్దిఖి, అఖిల భారత ప్రగతిశీల మహిళా సమాఖ్య కార్యదర్శి కవితా కృష్ణన్, ప్రగతిశీల మహిళా సంఘటన ప్రధాన కార్యదర్శి పూనమ్ కౌశిక్, పియుసిఎల్ నేతలు లారా జెసానీ, కవితా శ్రీవాస్తవ్, సీమా అజాద్, శాలిని గెరా, అరుంధతి ధురు, మీరా సంఘమిత్ర (నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్), నిషా బిశ్వాస్, హైదరాబాద్‌కి చెందిన పౌర హక్కుల కార్యకర్త కనీజ్ ఫాతిమా, అమ్ము, అమృత, చయనకి, స్వాతిజ (ఫోరమ్ అగైనెస్ట్ అప్రెషన్ ఆఫ్ వుమెన్) తదితరులు ఉన్నారు. స్కూళ్లలో హిజాబ్ ధరించడం ఇస్లామిక్ మతపరంగా తప్పనిసరి కాదని, తమ కాలేజీల్లో విద్యార్థులకు యూనిఫారాన్ని నిర్దేశించే హక్కు కాలేజీ అభివృద్ధి కమిటీలు (సిడిసి)కు వుందన్న కర్నాటక హైకోర్టు ఉత్తర్వులను వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
- ఈ వివాదం సర్వోన్నత నాయస్థానానికి ఇప్పటికే తెలుసు, హిజాబ్ ధరించడం ముస్లిం బాలికల, యువతుల హక్కు. దీనిని సుప్రీం కోర్టు పరిరక్షించాలి.
- యూనిఫారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు కాలేజీల్లోని సిడిసిలకు వుందని కర్నాటక హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. కర్నాటకలోనే, పలు కాలేజీలు తమ నిబంధనలకు కొన్ని సవరణలు చేశాయి. యూనిఫారాలతో పాటు హిజాబ్‌లు కూడా ధరించవచ్చంటూ పేర్కొన్నాయి. సిక్కులు టర్బన్లు, హిందువులు నుదుటిన బొట్టు, చేతులకు దారాలు, సింధూరం వంటి వాటిని ధరిస్తున్న మాదిరిగానే ముస్లిం మహిళలు యూనిఫారాలతో పాటు హిజాబ్ ధరించడాన్ని అనుమతించాలని కర్నాటకలోని అన్ని సిడిసిలకు విజ్ఞప్తి చేస్తున్నాము..
- హిజాబ్ ధరించడాన్ని నిషేధించే నిబంధన కర్నాటకలో ఏ కాలేజీలోనూ లేదు. సిడిసిలు ఈ విషయాన్ని గుర్తించాలి. వాస్తవానికి, తమ కాలేజీ యూనిఫారంకు అనుగుణంగా హిజాబ్‌లు ధరించవచ్చని ఒక కాలేజీ తన నిబంధనావళిలో పేర్కొంది. హిందూత్వ గ్రూపులే దీనిపై వివాదాన్ని సృష్టించాయి. దీనిని పరిష్కరించాల్సిన కర్ణాటక హైకోర్టు సమస్యను మరింత జటిలం చేసింది. మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన అనేకమందిని ప్రమాదంలో పడేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశించాలంటే ముందుగా గేటు వద్దే హిజాబ్‌ను తొలగించాలని డిమాండ్‌చేయడం వల్ల వారు బహిరంగంగా అవమానానికి గురవుతారు. హైకోర్టు ఉత్తర్వుల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. హిజాబ్‌పై నిషేధాన్ని నిరసిస్తూ ముస్లిం టీచర్లు కొందరు రాజీనామా చేశారు. ఇతర బహిరంగ ప్రదేశాల్లో కూడా హిజాబ్ ధరించినవారిని వేధింపులకు గురిచేసే సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలు, మహిళలు ఇకపై ఎలాంటి వేధింపులు, వివక్ష, బహిరంగంగా అవమానాలు వంటి వాటికి గురికాకుండా కాపాడేందుకు సుప్రీం కోర్టు తక్షణమే కలుగజేసుకుని కర్నాటక హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలి.. 5.కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పుదారి పట్టించేదిగా, అసంతృప్తికరంగా వుంది.
- హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదనే వాదన కోసమే ఎక్కువ సమయం వెచ్చించింది. కీలకమైన అంశాన్ని పరిష్కరించడంలో విఫలమైంది. హిజాబ్ ధరించిందనే కారణంతో ఆమెను చదువుకు దూరం చేయడం వివక్ష కాదా, రాజ్యాంగ విరుద్ధం కాదా?
- తప్పనిసరిగా పరదా ధరించడమనే పద్ధతి ముస్లిం మహిళలను ఎలా విభజించింది, వేరు చేసిందో డాక్టర్ అంబేద్కర్ రాసిన వ్యాసంలోని ఒక పేరాను హైకోర్టు తన తీర్పులో ఉదహరించింది. అంబేద్కర్ వ్యాఖ్యలను ఈ తీరున వక్రీకరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తప్పనిసరిగా పరదా వ్యవస్థను పాటించడం బాలికలు, మహిళలు బహిరంగంగా రాకుండా నిరోధిస్తోందని, చదువుకోవడం దగ్గర నుండి బయటి కార్యకలాపాల వరకు అన్నింటిలోనూ ముస్లిం మహిళలు బలవంతంగా వేరు పడుతున్నారని అంబేద్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకానీ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా హిజాబ్ ధరించిన మహిళ లేదా బాలికను చదువుకు దూరం చేయాలని చెప్పలేదు. అలాగే ఇంట్లోనే ఏకాకి కావాలని లేదా ప్రత్యేక ముస్లిం స్కూలు లేదా కాలేజీలో చదువుకునేలా ఒత్తిడి తేవడం ద్వారా వారిని వేరు చేయాలని చెప్పలేదు.
- మతపరమైన స్వేచ్ఛను కల్పిస్తున్న రాజ్యాంగ హక్కు మతపరమైన ఆచారాలన్నింటినీ కాపాడలేదని శబరిమల కేసులో ఇచ్చిన తీర్పును కూడా కర్నాటక హైకోర్టు ఈ సందర్భంగా ఉదహరించింది. కాబట్టి హిజాబ్ ధరించాలన్న ఆచారాన్ని కాపాడనక్కరలేదని పేర్కొంది. ఆలయాల్లోకి మహిళల ప్రవేశాన్ని నిరోధించడానికి వ్యతిరేకంగా ఇచ్చిన శబరిమల తీర్పును, హిజాబ్ ధరించిన బాలికలు స్కూలుకు లేదా కాలేజీకి వెళ్ళకుండా నిషేధించడాన్ని సమర్ధించుకోవడానికి ఎలా ఉపయోగిస్తారు?
- యూనిఫారాలను, ఏకరూపత (యూనిఫార్మిటీ)ను ఒకేగాటన కట్టింది. భారతదేశంలో స్కూళ్ళు, కాలేజీల యూనిఫారాలు ఎప్పుడూ కూడా సామాజిక, మతపరమైన వైవిధ్యతకు వెసులుబాటు కల్పించాయి. టర్బన్లు, హిజాబ్‌లు ధరించడం యూనిఫారాల్లో ఎన్నడూ అడ్డుకాలేదు. బలవంతంగా ఏకరూపతను సాధించడమనేది భారతదేశ కాలేజీలు,స్కూళ్ళలో ఎన్నడూ లేదు. హిందూ బాలిక ముక్కుపుడక ధరించడాన్ని దక్షిణాఫ్రికా స్కూలు అంగీకరించని కేసులో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ ఉదహరించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ కేసులో హిజాబ్‌ను దానితో పోల్చలేం. కోర్టు యొక్క నైతిక, రాజ్యాంగపరమైన వాదనలు ఇటువంటి పక్షపాత ధోరణులపై ఆధారపడరాదు.
- మహిళలను బలవంతంగా వేరు చేయడం పట్ల అంబేద్కర్ వ్యక్తం చేసిన ఆందోళనలను స్వచ్ఛందంగా హిజాబ్ ధరించడానికి తప్పుగా ముడిపెడుతూ ఈ తీర్పు ఇచ్చారు. ఇది, హిజాబ్ ధరించే మహిళలకు వ్యతిరేకంగా వుంది. దీన్ని స్కూళ్ళు, కాలేజీల్లో అనుమతించరాదు. మహిళల స్వయంప్రతిపత్తి, వారి సమ్మతి అనే భావనను అర్ధం చేసుకోవడంలో ఈ తీర్పు విఫలమైంది. మహిళలపై బలవంతంగా మతాచారాలను రుద్ధడాన్ని, నిర్దిష్ట ఆచారాలను పాటించాలని మహిళలు స్వచ్ఛందంగా ఎంచుకోవడాన్ని రెండింటినీ ఒకే గాటన కట్టడం సరికాదు. శబరిమల కేసులో ఈ పాయింట్ మనకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఆలయాల్లో మహిళలను ప్రవేశించనీయకుండా నిషేధించడం తమ హక్కులను, సమానత్వాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ కొంతమంది మహిళలు కోర్టుకు వెళ్ళారు, కానీ ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు స్వచ్ఛందంగా ఆలయాల్లోకి తాము ప్రవేశించకూడదనే మహిళలపై ఏ విధంగానూ ఒత్తిడి తీసుకురావడం లేదు. ఈవిషయాన్ని ఇక్కడ గుర్తించాలి. అలాగే, విముక్తి పేరుతో హిజాబ్ ధరించిన మహిళలు లేదా బాలికలు విద్యా సంస్థల్లోకి ప్రవేశించరాదనడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.
ఈ రీత్యా హిజాబ్ ధరించే ముస్లిం విద్యార్ధినులకు, విద్యా, స్వయంప్రతిపత్తి హక్కుల కోసం వారు చేసే పోరాటానికి తమ సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.