Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్ఎంజీఈలో 80 శాతం మంది విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు విఫలం
- ప్రత్యామ్నాయ వృత్తుల వైపు చూపు
- సగటున 20 శాతం మందికే సక్సెస్
న్యూఢిల్లీ : విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన భారతీయులకు సొంత దేశంలో ప్రాక్టీస్ చేయాలనే కోరిక కలగా మారుతున్నది. కారణం.. ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ)లో అర్హత సాధించాల్సి ఉండటం. ప్రతి ఏడాది వేల మంది భారతీయులు విదేశీ యూనివర్సిటీల నుంచి మెడికల్ డిగ్రీలతో ఎఫ్ఎంజీఈకు హాజరువుతుంటారు. తమ సొంత దేశంలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇందులో వారు అర్హత సాధించాల్సి ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (గతంలో ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) దీనిని తప్పనిసరి చేసింది. అయితే, ఈ ఎఫ్ఎంజీఈ మాత్రం ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకు కష్టంగా మారింది. దాదాపు 80 శాతం మంది ఈ పరీక్షలో విఫలమవుతున్నారు. దీంతో చాలా మంది డాక్టర్ అయ్యి సొంత దేశంలో ప్రాక్టీస్ చేయాలన్న తమ కలలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వారంతా ప్రత్యామ్నాయ వృత్తుల వైపునకు మళ్లుతున్నారు. ఈ విషయంలో ఆంగ్ల వార్త సంస్థ 'ది ప్రింట్' కొందరి గ్రాడ్యుయేట్ల నుంచి వారి అనుభవాలను సేకరించింది.
గతేడాది 23 శాతం మందే..!
ఎన్బీఈ డేటా ప్రకారం సగటున వారిలో 20 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షను క్లియర్ చేయగలుగుతు న్నారు. ఎఫ్ఎంజీఈ ను క్లియర్ చేసిన తర్వాతే భారత్‌లో ప్రాక్టిస్ చేయడానికి రష్యా, ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో విద్యనభ్యసించిన వైద్య గ్రాడ్యుయేట్లకు అనుమతి ఉంటుంది. అయితే, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు మాత్రం ఈ పరీక్షతో అవసరం ఉండదు. 2019లో ఎఫ్ఎంజీఈ ని క్లియర్ చేసిన విదేశీ గ్రాడ్యుయేట్లు 25.79 శాతం మంది మాత్రమే. ఇది 2020లో 14.68 శాతంగా, 2021లో 23.83 శాతంగా ఉన్నది. 2019కి ముందు ఈ సంఖ్య మరింత కనిష్టంగా ఉన్నది.
అయితే, ఈ టెస్టులో విఫలమైన దాదాపు 80 శాతం మంది గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఏమిటీ? వీరిలో కొందరు మెడిసిన్‌ను కొనసాగించాలనీ, ఇతర మార్గాన్ని అవలంభించాలనే తమ కలను వదులుకుంటే.. మరికొందరు దీనికే కట్టుబడి ఉంటారు. ఎఫ్ఎంజీఈ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎన్బీఈతో 'నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్'పై విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు సంతకం చేస్తారు. అయితే, వీరిలో కొందరు గ్రాడ్యుయేట్ల నుంచి వారి అభిప్రాయాలను 'ది వైర్' సేకరించింది.
'ఇంకా కలను వదులుకోలేదు'
మెడిసిన్ చేయాలనే తన కలను ఇంకా వదులుకోలేదని ముంబయికి చెందిన మెడికల్ గ్రాడ్యుయేట్ (32) తెలిపింది. రష్యాలోని ర్యాజాన్ ఒబ్లాస్ట్‌లో ఎనిమిదేండ్ల క్రితం ఆమె ఎంబీబీఎస్‌ను పూర్తి చేసింది. పది ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ఎఫ్ఎంజీఈని క్లియర్ చేయలేకపోయింది. ప్రస్తుతం ఆమె ముంబయిలోని ఒక ఇన్స్టిట్యూట్లో హాస్పటల్ మేనేజ్మెంట్ చేస్తున్నది. ఎఫ్ఎంజీఈ కి ఈ ఏడాదీ హాజరయ్యాననీ, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయనీ, 12 మార్కుల విలువ చేస్తే ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వివరించారు. విద్యార్థులు ఇప్పుడు ఈ విషయంపై ఎన్‌బీఈలో పిటిషన్ వేశారు.
డాక్టర్ కావాలన్న ఆశను వదులుకొని..!
ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించ డంలో విఫలమ వుతున్న చాలా మంది తమ సుదీర్ఘ లక్ష్యమైన వైద్య వృత్తికి స్వస్తి పలుకుతున్నారు. వీరిలో కొందరు 'ది ప్రింట్'తో మాట్లాడుతూ.. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో పలుమార్లు విఫలమైన తర్వాత ప్రత్యామ్నాయ వృత్తులను చేపట్టడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. తాను మాత్రం ఎఫ్ఎంజీఈ లో పలు వైఫల్యాల తర్వాత వైద్య వృత్తికి స్వస్తి పలకాలని మూడేండ్ల కిందటే నిర్ణయిం చుకున్నట్టు హర్యానాకు చెందిన వ్యాపారవేత్త (35) తెలిపారు. రష్యా రాజధాని మాస్కోలోని ఒక యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీని చేసిన ఆయన.. ప్రస్తుతం తమ కుటుంబ వ్యాపారాన్ని చూసుకుం టున్నారు. ఈయన లాగే చాలా మంది ఇతర మార్గాల వైపు మళ్లుతున్నారు.