Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ : పశ్చిమాసియా, యూరోప్ దేశాలలో కరోనా వింభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలనీ, అలాగే కొత్త వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా జినోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపాలనీ, వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన పెంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని రాష్ట్రాలను హెచ్చరించారు. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలనీ, టెస్టులు పెంచాలని సూచించారు.
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, వైరస్ వ్యాప్తిని అరికట్టే ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్, ట్రాక్, ట్రీట్, కొవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, కొత్త కేసుల క్లస్టర్లపై నిఘా పెట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, సామూహిక కార్యక్రమాల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలపై అవగాహన పెంచాలని లేఖలో పేర్కొన్నారు. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మార్చి 16న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్టు రాజేశ్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలనీ, జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు.ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల వ్యాప్తి కొంత మేర తగ్గింది. రోజువారీ కేసులు 5వేలకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 2,528 కేసులు నమోదు కాగా, కేసుల మొత్తం సంఖ్య 4,30,04,005కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 29,181కి తగ్గిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 149 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,16,281కి పెరిగింది.