Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుల తిప్పలు.. యోగి సర్కారు ఉదాసీన వైఖరి
- బుందేల్‌ఖండ్‌లో అన్నదాతల ఆత్మహత్యలు
- రాష్ట్ర ప్రభుత్వంపై రైతు సంఘాల ఆగ్రహం
లక్నో : యూపీలో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. పంట నష్టాలు, అప్పుల బాధలు, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలు వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా కరువు ప్రాంతంగా పేరున్న బుందేల్‌ఖండ్‌లో ఈ పరిస్థితి తీవ్రంగా మారింది. ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో రాష్ట్రంలోని యోగి సర్కారు తీరుపై రైతులు, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బండా జిల్లాలో ఇటీవల ఒక రైతు చున్ను సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంకు నుంచి, స్థానిక వడ్డీవ్యాపారుల నుంచి సదరు రైతు కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు, వడ్డీ వ్యాపారులు ఆయనపై ఒత్తిడి చేశారనీ, ఈ కారణంగానే ఆయన ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి కుటుంబీకులు తెలిపారు. కూతురు పెండ్లి కోసమని మటౌంద్ బ్రాంచ్ సెంట్రల్ బ్యాంకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) నుంచి తన సోదరుడు రూ. 1.80 లక్షలు అప్పుగా తీసుకున్నాడని చున్ను సింగ్ సోదరుడు మన్ సింగ్ తెలిపాడు. అలాగే, వడ్డీ వ్యాపారుల నుంచి చున్ను రూ. 2.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడని వివరించాడు. వడ్డీ వ్యాపారుల విషయంలో చున్ను తీవ్రంగా భయపడ్డాడని మన్ సింగ్ చెప్పాడు. అకాల వర్షాల కారణంగా చున్ను సింగ్ తన వ్యవసాయ భూమిలో వేసిన పంటలో అధిక భాగం నష్టపోవాల్సి వచ్చింది. మిగతా పంటకు తెగులు సోకింది. దీంతో పంట చేతికి వచ్చిన తర్వాత అప్పులు తీరుద్దామనుకున్న చున్ను సింగ్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో అప్పులు చెల్లించకపోతే పరువు పోతుందన్న భయంతో చున్ను బలవన్మరణాకి పాల్పడ్డాడని మన్ సింగ్ చెప్పాడు. కాగా, చున్ను సింగ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వడ్డీ వ్యాపారి నుంచి ఫోన్ కాల్ వచ్చిన రెండు రోజుల తర్వాతే చున్ను సింగ్ ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
అలాగే, మరొక గ్రామంలో బిందూ ప్రసాద్ రాజ్‌పూత్ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేసిన పంట మీద నమ్మకంతో అప్పులు తీర్చొచ్చని భావించిన రైతులు కరువు పరిస్థితులతో బలవన్మరణాలకు పాల్పడిన పరిస్థితులు బుందేల్‌ఖండ్‌లో ఏర్పడ్డాయి.
అయితే, ఇక్కడ రైతన్నలు తమ ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ యోగి సర్కారు మాత్రం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నది. ఈ ప్రాంతంలోని బాండా, మహౌబా, చిత్రకూట్, జలౌన్ వంటి ఏడు జిల్లాల్లో కరువు పరిస్థితులున్నాయి. అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడినవారి సంఖ్య ఇక్కడే అధికం. అయితే, ప్రభుత్వ తప్పుడు విధానాల, బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల నుంచి రైతన్నల మీద ఒత్తిడి ఈ పరిస్థితులను మరింత తీవ్రం చేస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.
ఒక అధ్యయనం ప్రకారం.. 2021-22లో చిత్రకూట్ డివిజన్‌కు చెందిన మొత్తం 4.29 లక్షలకు పైగా రైతులు రూ. 2,841.98 కోట్లను కేసీసీ కింద అప్పుగా తీసుకున్నారు. అయితే, వ్యవసాయంలో వస్తున్న నష్టాలు, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగా రైతులు తాము తీసుకున్న రుణాలను చెల్లించలేకపోతున్నారనీ, ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.