Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కావాలనే లేనిపోని ఆరోపణలు : చినజీయర్‌స్వామి
- ముచ్చింతల్‌లో దర్శనానికి టికెట్టు పెట్టలేదని వ్యాఖ్య
విజయవాడ: తాను ఆదివాసీ దేవతలను తులనాడినట్టు జరుగుతున్న ప్రచారం సరికాదని, కొందరు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చినజీయర్‌స్వామి అన్నారు. సమ్మక్క, సారలమ్మ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం. ఈ విషయంలో తనపై వస్తున్న విమర్శలకు చినజీయర్ వివరణ ఇచ్చుకునేందుకు శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. క్షమాపణలు చెప్పకుండా మహిళలను తానెప్పుడూ కించపర్చేలా మాట్లాడలేదని, మహిళలపై అపారమైన గౌరవం ఉందన్నట్టు చెప్పుకునేందుకు ఎక్కువ సేపు శ్రమించారు. మహిళ సమాజంలో శక్తికి కేంద్రమని, మహిళలందరికీ మంగళశాసనాలు పలుకుతున్నామని ఘనంగా చెప్పుకున్నారు. తామంతా రామానుజాచార్య పరంపరగా వచ్చినవాళ్లమన్నారు. ఆదివాసీ జనానికి.. ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించే సంప్రదాయంలోంచి వచ్చినవాళమనీ, వాళ్లను చిన్నచూపుగా మాట్లాడే అలవాటు లేదన్నారు. అందరినీ ఆదరించాలనేదే తమ అభిమతమని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. గిరిజనులు మంత్రాలను అద్భుతంగా చదువుతారని తెలిపారు. సమాజహితం కోరే వ్యక్తిగా అలాంటిది చెప్పడం భావ్యం గనుక అలాంటివాటిగురించి తాము ఎప్పుడైనా ఏదైనా అని ఉంటామన్నారు. అది కూడా ఈ మధ్యకాలంలో అలాంటి మాటలు అనలేదన్నారు. అది ఏదో బహుశా 20 ఏండ్లక్రితం అని ఉంటామని చెప్పారు.
తాము మీడియాను పట్టించుకోమని, దూరంగా ఉంటామన్నారు. ఈ మధ్యకాలంలో సమతామూర్తి గురించి చెప్పేందుకే మీడియాతో టచ్‌లో ఉన్నామని చినజీయర్ వెల్లడించారు. ఓ విషయాన్ని పనికట్టుకొని పెద్ద ఇష్యూ చేసి ఈ మధ్య టీవీల్లో వాళ్లవాళ్ల ముఖాలను చూయించుకునేందుకు చాలామంది ఇష్టపడుతున్నారని అన్నారు. ఉక్రెయిన్-రష్యా హడావిడి తగ్గిందనీ, ఇక ఏదో ఒక హడావిడి ఉండాలని ఈ అంశం పట్టుకున్నట్టున్నారని తప్పంతా వారిపై నెట్టేందుకు ప్రయత్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో గ్యాప్‌పై ప్రశ్నకు.. తనకు ఎవరితో గ్యాప్ లేదనీ, ఎవరైనా దూరం ఉంటే తమకు సంబంధం లేదన్నారు. యాదాద్రికి పిలిస్తే పోతా.. లేకపోతే లేదన్నారు. రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం లేదన్నారు. తాము భిక్ష సన్యాసులమనీ, తమ పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదన్నారు. ముచ్చింతల్‌లో దర్శనానికి ఎలాంటి టిక్కెట్ పెట్టలేదన్నారు. టిక్కెట్ పెట్టింది నిర్వహణ కోసమేననన్నారు.