Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైట్ టు ఫుడ్ క్యాంపేయిన్.. ప్రధాని మోడీకి లేఖ
- 80శాతం మంది కుటుంబ ఆదాయం పుంజుకోలేదు..
- ఆహార అభద్రతలో అణగారిన వర్గాలు..
- మార్చితో ఆగిపోనున్న పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన!
న్యూఢిల్లీ : పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని(ఉచిత రేషన్) మరికొంత కాలం అమలు జేయాలని ప్రధాని నరేంద్రమోడీని 'రైట్ టు ఫుడ్ క్యాంపేయిన్' కోరింది. కరోనాతో కుటుంబ ఆదాయాన్ని కోల్పోయిన వారి ఆర్థిక పరిస్థితి ఇంకా పుంజుకోలేదని, ఆహార అభద్రతతో బతుకున్నారని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన, అణగారిన వర్గాల్లో సంక్షోభ తీవ్రత ఎక్కువగా ఉందని 'రైట్ టు ఫుడ్ క్యాంపేయిన్' ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న గంగారం పైక్రా, ఆయేషా, కవితా శ్రీవాస్తవ, దీపా సిన్హా, అనురాధా తల్వార్, ముక్తా శ్రీవాస్తవ, అమృతా జోహ్రా మొదలైన సామాజికవేత్తలు ప్రధానికి తెలియజేశారు. వారు లేఖలో పేర్కొన్న పలు
అంశాలు ఈ విధంగా ఉన్నాయి... కరోనా సంక్షోభం నేపథ్యంలో, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన..పథకం ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి గోధమలు లేదా బియ్యం ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అమలు మార్చితో ముగియనున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న కారణంగా కేంద్రం ఇప్పటివరకూ కొనసాగించిందని సమాచారం. ఏప్రిల్ నుంచి ఈ పథకం అమలు నిలిపివేస్తారని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఆదాయాలు కోల్పోయిన, ఆర్థిక అభద్రతలో ఉన్న కుటుంబాలు ఎంతగానో నష్టపోతాయి.
ఇటీవల (డిసెంబర్ 2021-జనవరి 2022) తాము చేపట్టిన 'హంగర్ వాచ్' సర్వేకు సంబంధించి పలు వివరాలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. కరోనా తర్వాత ఆదాయాన్ని కోల్పోయామని 80శాతం మంది చెప్పారు. డబ్బు, ఆదాయం లేక ఆకలితో అలమటిస్తున్నామని 25శాతం మంది చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత రేషన్ సరుకుల పంపిణీ ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. కాబట్టి ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాదు అర్హులైన పేదలందరికీ ఉచిత రేషన్ అందేట్టు పథకాన్ని 'సార్వత్రికం' చేయాలని 'రైట్ టు ఫుడ్ క్యాంపేయిన్' అభిప్రాయపడుతోంది.
హంగర్ వాచ్లో..
- లాక్డౌన్ నిబంధనలు ఎత్తేసినా..కోవిడ్ సంక్షోభ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. కోట్లాదిమంది జీవనోపాధి కోల్పోయారు.
- అసంఘటితరంగంలో 90శాతం మందిపై సంక్షోభం దారుణమైన దెబ్బకొట్టింది.
- సర్వేలో పాల్గొన్నవారిలో 80శాతం ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 25శాతం మందికి ఈ సమస్య తీవ్రస్థాయిలో ఉంది.
- కరోనా ముందునాటితో పోల్చితే నాణ్యమైన ఆహారం తీసుకోవటం లేదని 41శాతం మంది చెప్పారు.
- వంటగ్యాస్ సిలిండర్ను కొనలేని పరిస్థితులో ఉన్నామని 67శాతం మంది చెప్పారు.
- భారీ మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయామని 45శాతం కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి.