Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపితో జట్టుకట్టే ప్రసక్తే లేదు
- ఎస్‌బిఎస్‌పి అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో విజయగర్వంతో బిజెపి ఐటి సైన్యం తప్పుడు ప్రచారాలాను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. కట్టు కథలతో రాజకీయ సమీకరణాలు మార్చే సమాచారం కుమ్మరిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టడమే కాకుండా ఆరు స్థానాల్లో విజయం సాధించిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని మార్ఫింగ్ చేసిన ఫొటోలతో ఒక కథనాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. ఆయన త్వరలోనే బిజెపి భాగస్వామిగా మారిపోనున్నారని ప్రచారం చేశారు. ఈ కథనాలు యుపిలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఓం ప్రకాశ్ శనివారం నాడు స్పందించారు. ఇవన్నీ తప్పుడు కథనాలనీ, అమిత్ షాతో భేటీ అయినట్లు వస్తున్న కథనాల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. సామాజిక మాధ్యమాల్లో సర్య్కులేట్ అవుతున్న చిత్రాలు పాతవని ఆయన నిర్ధారించారు. పాత చిత్రాలతో కొత్త పుకార్లు సృష్టిస్తున్నారని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీతోనే తమ పొత్తు కొనసాగుతుందని, ఈ నెల 28న సంయుక్త కార్యాచరణ కోసం సమావేశం కానున్నామని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక బిజెపితో జట్టు కట్టే ప్రసక్తే లేదన్నారు. ఇక ఈ పుకార్లను ఎస్‌బిఎస్‌పి జాతీయ కార్యదర్శి అరవింద్ రాజ్‌భర్ కూడా ఖండించారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతత్వంలోని ఎస్‌బిఎస్‌పి గతంలో బిజెపితో పొత్తు ఉండేది. 2017 యోగి ఆదిత్యానాథ్ అధికారంలోకి వచ్చాక.. కేబినెట్లో రాజ్‌భర్ కూడా చేరారు. అయితే.. వెనుకబడిన వర్గాలను బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ రెండేళ్ల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి కూటమి నుంచి బయటకు వచ్చేశారు.