Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు..
- వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు: ఏచూరి
న్యూఢిల్లీ : మల్లు స్వరాజ్యం తుదిశ్వాస విడిచారన్న వార్తతో తన గుండె బాధతో బరువెక్కిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక స్ఫూర్తివంతమైన నాయకురాల్ని పార్టీ కోల్పోయిందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ''బరువెక్కిన మనస్సుతో..ఆమెకు రెడ్ సెల్యూట్ చేస్తున్నా. కమ్యూనిస్ట్ ఉద్యమ పోరాటంలో మల్లు స్వరాజ్యం ఒక ప్రత్యేకమైన వ్యక్తి. భూస్వాములకు, నిజాం ప్రయివేట్ సైన్యానికి, రజాకార్లకు వ్యతిరేకంగా అత్యంత ధైర్యసాహసాలతో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తన పదునైనా వాగ్ధాటితో ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. ముఖ్యంగా సాయుధ పోరాటంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి కారణం మల్లు స్వరాజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆమె పనిచేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా సేవలు అందించారు.
అటు తర్వాత కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా కొనసాగారు. వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆమె 75ఏండ్లుగా ప్రజాసేవలో ఉన్నారు. ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నా. లాల్ సలాం.. కామ్రెడ్ మల్లు స్వరాజ్యం''అని ఏచూరి అన్నారు.