Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాకు రూపాయిల్లోనే చెల్లించండి : ఇరాన్ రాయబారి అలీ చిజెనీ
- భారత్ నుంచి దిగుమతులకు రూపాయిలను ఉపయోగిస్తాం..
- విద్యార్థులు, పర్యాటకులకు మల్టీఫుల్ వీసాలు జారీచేస్తాం..
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత సమయంలో భారత్ ఇంధన అవసరాలు చాలా భారంగా మారాయి. ముడి చమురు కొనుగోలు కోసం విదేశీ మారక నిల్వల్లో డాలర్లను పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతటి విపత్కర పరిస్థితిలో భారత్ ఇంధన అవసరాలు తీర్చడానికి ఇరాన్ ముందుకొచ్చింది. ముడి చమురు, సహజవాయువు అందజేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందంటూ భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చిజెనీ అన్నారు. ఇరు దేశాల వర్తకవాణిజ్యం రూపీ-రియాల్ పునరుద్ధరించేందుకు తమకు అంగీకారమేనని, తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు (సుమారుగా రూ.2.2లక్షల కోట్లు) చేరుకుంటుందని ఆయన తెలిపారు. అంతేకాదు భారత్‌లోని వర్తక, వాణిజ్యవేత్తలకు, విద్యార్థులకు, పర్యాటకులకు ఉపయోగపడే కాగిత రహిత..'మల్టీఫుల్ వీసా'లు జారీచేస్తామని ఆయన చెప్పారు. ఇరాన్ మొదట్నుంచీ భారత్‌తో సత్సంబంధాల్ని కోరుకుంటోంది. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉండేది. అయితే మోడీ సర్కార్ వచ్చాక..భారత్..అమెరికాకు మరింత దగ్గరైంది. అమెరికా ప్రయోజనాలకు గుడ్డిగా తలూపింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చాక..ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేశాడు. ఇరాన్‌పై కొత్తగా ఆంక్షలు విధించాడు. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా చెప్పగానే..అందుకు భారత్ తలొగ్గింది. అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఇరాన్-భారత్ మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు పెద్దగా మెరుగుపడలేదు.ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ ఇంధన అవసరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పుడున్న ధరల్లో అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. దీనిని తప్పించుకోవాలంటే రష్యా, ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు ఒక్కటే భారత్ ముందున్న మార్గం. తక్కువ ధరలో (25శాతం తక్కువ ధరకు) భారత్‌కు ముడి చమురు అమ్మడానికి సిద్ధమని రష్యా ఇప్పటికే ప్రకటించింది. దాంతో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ కంపెనీలు రష్యాతో చమురు కొనుగోలు కాంట్రాక్ట్స్ చేసుకున్నాయి. తాజాగా ఇరాన్ కూడా డాలర్లలో కాకుండా, రూపీ-రియాల్ మారకంలో వర్తకవాణిజ్యం నిర్వహించుకుందామని తెలిపింది.