Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వరల్డ్ హ్యాపీనెస్ సూచిక'లో 136వ ర్యాంక్
- మనకన్నా మెరుగైన స్థానాల్లో నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రజలు సంతోషానికి దూరమై, కష్టాలు..కన్నీళ్లతో జీవితాన్ని గడుపుతున్నారని 'వరల్డ్ హ్యాపీనెస్ నివేదిక-2022' పేర్కొన్నది. గత ఏడాదితో పోల్చుకుంటే భారత్ ర్యాంక్ కాస్త మెరుగుపడ్డా..ఆనందం, సంతృప్తికి దూరమైన దేశాల్లో మనదేశం ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది విడుదల చేసిన ర్యాంక్‌లో భారత్‌కు 136వ స్థానం దక్కింది. దేశ జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయిల్ని పరిగణలోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి ప్రతిఏటా ఈ సూచికను విడుదల చేస్తోంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి పలు గణాంకాల్ని ఆధారంగా చేసుకొని నివేదిక రూపొందిస్తోంది. మార్చి-20 వరల్డ్ హ్యాపీనెస్ దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఈ ఏడాది విడుదలైన 'వరల్డ్ హ్యాపీనెస్ సూచిక'లో ఫిన్లాండ్ మొదటి ర్యాంక్‌లో నిలబడగా, అట్టడుగున 146వ ర్యాంక్‌తో ఆఫ్ఘనిస్తాన్ స్థానం పొందింది. ఆసియా దేశాలతో పోల్చుకుంటే తాజా సూచికలో నేపాల్-84, బంగ్లాదేశ్-94, పాకిస్థాన్-121, శ్రీలంక-127వ స్థానాలతో భారత్‌కన్నా మెరుగైన ర్యాంకులు పొందాయి. వరుసగా ఐదోసారి ఫిన్లాండ్ టాప్ ర్యాంక్‌లో నిలబడింది. ఈ ఏడాది విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ ముందు వరుసలో నిలబడగా, అమెరికాకు 16వ ర్యాంక్, బ్రిటన్‌కు 17, ఫ్రాన్స్‌కు 20వ స్థానం దక్కింది. ఉక్రెయిన్-రష్యా సంక్షోభానికి ముందే ఈ ర్యాంకుల్ని రూపొందించినట్టు తెలిసింది. వరల్డ్ హ్యాపీనెస్ సూచికపై భారత్‌లో ప్రతిపక్షాలు స్పందించాయి. ప్రజల్లో ఆకలి సమస్య, పేదరికం, నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉందని, దీనికితోడు విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, సమాజంలో దెబ్బతిన్న శాంతి సామరస్యాలు..ఇవన్నీ ప్రజల సంతోషాన్ని, ఆనందాన్ని దూరం చేస్తున్నాయని వామపక్షాలు అభిప్రాయపడ్డాయి.