Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరువేల ఇండ్లకు గానూ 17 శాతమే పూర్తి.. కేంద్రం గణాంకాలు
న్యూఢిల్లీ: కాశ్మీర్ పండిట్లపై వేధింపుల గురించి ఉపన్యాసాలిచ్చే బీజేపీ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారికి త్వరితగతిన ప్రయోజనాలను చేకూర్చడంలో మొండి చేయి చూపిస్తున్నది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ పండిట్ల కోసం చేపట్టిన ఇండ్ల నిర్మాణాల ప్రక్రియ నత్తనడకన సాగడమే దీనికి నిదర్శనం. కాశ్మీర్ పండిట్ల కోసం ఆరువేల ఇండ్ల నిర్మించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2015లో ప్రతిపాదించింది. అయితే, ఏడేండ్లలో కేవలం 17 శాతం ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే, దాదాపు 1025 ఇండ్లు మాత్రమే. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. 1990లో దాదాపు 83 వేల కాశ్మీర్ పండిట్ కుటుంబాలు కాశ్మీర్ లోయను వీడాయని కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ వెబ్సైట్ సమాచారం. అయితే, కాశ్మీర్ పండిట్లు తిరిగి కాశ్మీర్ లోయకు తిరిగి వెళ్లేందుకు ఆరు వేల వసతి గృహాలను నిర్మిస్తామని 2015లో కేంద్రం ప్రకటించింది. ఈ ఇండ్ల నిర్మాణాల ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో నివేదించింది. ఆ సమయానికి 849 వసతి గృహాలు మాత్రమే పూర్తిగా నిర్మాణం కాగా.. 176 పూర్తి కావడానికి దగ్గరగా ఉన్నాయి. కాగా, హౌం మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం 50 శాతం వసతి గృహాల నిర్మాణం ఇంకా మొదలు కావాల్సి ఉన్నది. ఇండ్ల నిర్మాణాలు మొత్తం వచ్చే ఏడాది నాటికి పూర్తయ్యే అవకాశమున్నదని ఈనెల 9న శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదికి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు పేర్కొన్నారు. ఇక వసతి గృహాలతో పాటు కాశ్మీరీ వలసదారుల కోసం మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంపై 2015లో మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఇందులో 1098 మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఎంప్లారుమెంట్ ప్యాకేజీని ప్రకటించి అమలు చేసింది. మూడు వేల ఉద్యోగాలకు గానూ 2905 ఉద్యోగాలను భర్తీ చేసింది.