Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్క్ యూజర్లపై భారీ వడ్డన
- త్వరలో రిటైల్ మార్కెట్లో ధరల పెంపు ఖాయం!
న్యూఢిల్లీ: ఇంధన ధరల్ని భారీగా పెంచే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెంచితే.. రాజకీయంగా తీవ్ర విమర్శలపాలవుతామన్న వ్యూహంతో కొత్త దారులు వెతుకుతోంది. తాజాగా టోకు వినియోగదారుల (బల్క్ యూజర్లు)కు షాకిచ్చింది. వీరు కొనుగోలు చేసే లీటర్ డీజిల్‌పై రూ.25 పెరిగింది. దాంతో ముంబయిలో బల్క్ యూజర్లకు లీటర్ డీజిల్ ధర రూ.122.05కు, ఢిల్లీలో రూ.115కు చేరుకుంది. పరిశ్రమలు ఎక్కువగా పెద్దమొత్తంలో డీజిల్‌ను కొనుగోలుచేస్తుంటాయి. ధరల పెంపు ప్రభావం వీటిపై తీవ్రస్థాయిలో ఉంటుంది. పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు కూడా పెరిగేందుకు దారితీస్తుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీ మొత్తంలో పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నామని చమురు సంస్థలు వెల్లడించాయి. రోజువారి విధానంలో ఇంధన ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4 తర్వాత ఇప్పటివరకు పెట్రో ధరల్లో మార్పు రాలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు భయపడి కేంద్రం వెనుకడుగు వేసింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చినా, ఆపై పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని చమురు ధరలపై ఎలాంటి ప్రకటనా చేయలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో రిటైల్ మార్కెట్లోనూ ధరలు పెంచి కేంద్రం సాధారణ వినియోగదారులకు షాక్ ఇవ్వటం ఖాయమని వారు అంచనావేస్తున్నారు. ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధర 40శాతం పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లకు ఎగబాకింది. దాంతో ఇక్కడ దేశీయంగా ధరలు పెరిగే అవకాశముందని వాహనదార్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి టోకు ధరల పెంపుతో..ఇది ఆగదని రిటైల్ మార్కెట్లోనూ ధరల పెరుగుదల తప్పదని విశ్వసనీయ సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈఅంశంపై సమీక్ష జరిగే అవకాశముంది. సాధారణంగా బల్క్ యూజర్లకు వర్తించే ధరలు రిటైల్ ధరలతో పోలిస్తే ఎక్కువుంటాయి. ఈ అధిక ధర నుంచి తప్పించుకోవడానికి వారంతా పెట్రోల్ పంపుల వైపు మళ్లారు.