Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రాష్ట్రాల సీఎంల ఎంపికపై తలపట్టుకున్న బీజేపీ అధిష్టానం
- మోడీ అధ్యక్షతన సమావేశం
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు విజయం బీజేపీలో కొత్త సమస్యలు సృష్టిస్తోంది. నాలుగు రాష్ట్రాల సీఎం ఎంపిక ఒక పట్టాన కుదరటం లేదు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు పూర్తయింది. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలై 10 రోజులు దాటుతున్నా..ప్రభుత్వాల ఏర్పాటు సంక్లిష్టంగా మారింది. సీఎం ఎంపిక, రాష్ట్రాల మంత్రివర్గ కూర్పుపై బీజేపీ అధినాయకత్వం తర్జనభర్జన పడుతోంది. దీనికి సంబంధించి ఆదివారం ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. మణిపూర్‌లో ఎన్బీరేన్సింగ్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తామని..ఎన్నికలైన పదో రోజైన ఆదివారం.. పార్టీ సీఎంగా ప్రకటించగానే..అసమ్మతి రాగాలు షురూ అయ్యాయి.వెంటనే సీఎం బీరేన్ సింగ్ ను ఢిల్లీకి పిలిచారు. ఎన్ బీరెన్ సింగ్‌తో పాటు, పార్టీ హైకమాండ్ బిస్వజిత్ సింగ్ , యుమ్నం ఖేమ్‌చంద్ పేర్లను కూడా చర్చించింది, అయితే చివరికి పార్టీ ఎన్ బీరెన్ సింగ్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది.ఇపుడు ఇదే రచ్చగా మారింది. దీంతో ప్రస్తుతానికి తాత్కాలిక సీఎంగా నియమించాలని బీజేపీ నిర్ణయించింది. ఆ లోగా బీరేన్ ను తొలగించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. యూపీలో ఇప్పటికే సీఎం యోగి పేరు ఖరారైంది. 25న లక్నోలోని ఎకానా స్టేడియంలో యోగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే యోగిని కూడా కొద్ది నెలల తర్వాత మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే..ఎన్నికలకు ముందు యోగి వ్యవహరించిన తీరుతో ..ఇప్పటికీ మోడీ, అమిత్‌షా ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. మరోవైపు గోవా, ఉత్తరాఖండ్‌లలో సీఎం పేరుపై ఉత్కంఠ నెలకొంది. ఇంతవరకూ గోవా,ఉత్తరాఖండ్‌లలో సీఎంల పేర్లను ప్రకటించలేదు.ఉత్తరాఖండ్‌లో జరిగే శాసనసభా పక్ష సమావేశంలో సీఎం ఎవరన్న విషయాన్ని ప్రకటిస్తామంటోంది. తాత్కాలిక సీఎం పుష్కర్ ధామి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఉత్తరాఖండ్ సీఎం రేసులో చాలా మందే ఉన్నారు. ఇక గోవాలోనూ బీజేపీ గెలిచినా...సీఎంగా ప్రమోద్ సావంత్‌నే ఉంచాలా..లేదా ..అని తెగ ఆలోచిస్తోంది. వాస్తవానికి గోవా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నాయకత్వంలో బీజేపీ భారీ విజయం సాధించింది.
గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలలో 17 మంది మద్దతు ఆయనకు ఉన్నది. అయితే దీనిపై ఇంతా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నది బీజేపీ. దీంతో ప్రమోద్ కు సీఎం చేస్తారా..లేదా అనే అనుమానాలు గోవా ప్రజల్లోనూ కలుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ అనుసరించిన సీఎం ల విధానాన్ని బీజేపీ కూడా పొల్లుపోకుండా ఫాలోఅవుతుందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.