Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లు స్వరాజ్యానికి ఘన నివాళి.. ఢిల్లీలో సంతాప సభ
- ధీరవనితను స్మరించుకున్న మహిళ, రైతు, కార్మిక సంఘం నేతలు
న్యూఢిల్లీ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని మహిళ, రైతు, కార్మిక సంఘం నేతలు స్మరించుకున్నారు. ఆదివారం నాడిక్కడ క్యానింగ్ లైన్ 36లో మల్లు స్వరాజ్యం సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా, ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ నేతలు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి.. ఘనంగా నివాళుర్పించారు. మల్లు స్వరాజ్యం చేసిన ఉద్యమాలను, ఆమె మార్గదర్శకత్వంలో జరిగిన పోరాటాలను నేతలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఐద్వా జాతీయ నేత ఎస్.పుణ్యవతి మాట్లాడుతూ సుదీర్ఘ కాలం ఉద్యమాల్లో నిలిచిన వీరవనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యమని అన్నారు. వ్యవసాయ కార్మికుల సమ్మెతో మల్లు స్వరాజ్యం ఉద్యమం ప్రారంభమైందని, జమీందారులు, జాగీర్దాలుకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సుదీర్ఘంగా పనిచేశారని తెలిపారు. మల్లు స్వరాజ్యం జీవితం, పోరాట స్ఫూర్తి ప్రజలందరికీ ఎల్లపుడూ గుర్తుంటుందని పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం పట్టిన జెండా దించకుండా ముందుకు కొనసాగిస్తామని అన్నారు. ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ మాట్లాడుతూ రైతు ఉద్యమంతో ఆమెకు అవినాభావ సంబంధం ఉందని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్. సింధూ మాట్లాడుతూ కార్మిక, కర్షక, మహిళ సమస్యలపై పోరాడిన మల్లు స్వరాజ్యం నేటీ తరానికి ఆదర్శమని అన్నారు. ఆమె అనుసరించిన సిద్ధాంతాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ నేత .పి.కృష్ణ ప్రసాద్, ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మైమూన మొల్లా, ఆశాశర్మ, సిఈసి సభ్యులు శర్బనీ సర్కార్, కెఎస్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధులకు మల్లు స్వరాజ్యం స్ఫూర్తి:చంద్రబాబు
అలాగే మల్లు స్వరాజ్యం మరణం పట్ల నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మల్లు స్వరాజ్యం ఎంతో మంది పోరాటయోధులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
తీరని లోటు:ఉపరాష్ట్రపతి
స్వాతంత్య్ర సమర యోధురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలుగు మహిళాశక్తి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం నిరూపమానమైనదని తెలిపారు. రెడు పర్యాయాలు శాసనభ్యురాలిగా ఆమె ఆందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.