Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ విద్యార్థులు సప్లిమెంటరీ రాసుకోవాల్సిందే..
- కర్నాటక ప్రభుత్వం కఠిన నిర్ణయం
న్యూఢిల్లీ : హిజాబ్ వివాదం కారణంగా కర్నాటకలో పరీక్షలు రాయలేకపోయిన ముస్లిం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వివాదం హైకోర్టు పరిధిలో ఉన్న సమయాన..ముస్లిం విద్యార్థులు పాఠశాల, కళాశాలల్లో ప్రాక్టికల్స్, ఇతర రాత పరీక్షలకు దూరమయ్యారు. న్యాయస్థానం నుంచి తుది తీర్పు వెలువడే వరకు ఓపిక పడదామని భావించారు. చివరికి ఈ వివాదంలో విద్యార్థులే తీవ్రంగా నష్టపోయారు! న్యాయస్థానం తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ప్రాక్టికల్స్, రాత పరీక్షలకు గైర్హాజరైన ముస్లిం విద్యార్థుల కోసం మరోమారు పరీక్షలు నిర్వహించమని బీజేపీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. గైర్హాజరైన విద్యార్థులు సప్లిమెంటరీ రాసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఇక ఇప్పుడు...పరీక్షలకు హాజరుకాలేకపోయిన ముస్లిం విద్యార్థుల సంగతి ఏంటన్నది చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కర్నాటక విద్యామంత్రి బి.సి.నగేశ్ మాట్లాడుతూ...'' గైర్హాజరు అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించే ఉద్దేశం లేదు. కారణాలేమైనా కావొచ్చు. పరీక్షలు మాత్రం మరోమారు నిర్వహించం. సప్లిమెంటరీ రాయాల్సిందే. వారికి ఎలాంటి మినహాయింపులూ ఇవ్వదలుచుకోలేదు'' అని చెప్పారు.
ఉడిపి జిల్లాలో మొదలైన హిజాబ్..వెనువెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వివాదం విస్తరించింది. విద్యాసంస్థల్లోకి హిజాబ్ ధరించి రాకూడదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయటంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టు ముంగిటకు చేరింది. కర్నాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.