Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణ వేగవంతం
- ఆసక్తిదారుల కోసం త్వరలో రోడ్‌షోలు : మంత్రి భగవత్ కరడ్
న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మడానికి మోడీ సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రోడ్ షోలు నిర్వహించనున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరడ్ తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ అమ్మకానికి గతేడాది మేలోనే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఎల్ఐసీ, కేంద్రానికి కలిపి 95శాతం వాటా ఉంది. అయితే ఇందులో ఎవరి వాటాలను ఎంత విక్రయించేదనేది ఇంకా స్పష్టత లేదని మంత్రి పేర్కొన్నారు. మూలధనం కోసం ఎల్ఐసీ ప్రభుత్వంపై ఆధారపడకుండా ఆ బ్యాంక్ కార్యకలాపాలు సాగడానికి ప్రయివేటీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. వాటాల విక్రయం ద్వారా పెట్టుబడులు సమీకరణ, నూతన టెక్నలాజీ. మెరుగైన మేనేజ్మెంట్ నిర్వహణకు అవకాశాలున్నాయన్నారు.
ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎల్ఐసీకి 49.24శాతం, ప్రభుత్వానికి 45.48శాతం, నాన్ ప్రమోటర్ షేర్హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇందులోని ప్రభుత్వ, ఎల్ఐసీ వాటాల విక్రయానికి వీలుగా ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లలో భేటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ వాటా విక్రయ సమయంలో ప్రస్తుత ఉద్యోగులు, వాటాదారులకు సరైన న్యాయం చేస్తామన్నారు. కీలకమైన వీటికి సంబంధించిన ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 51శాతం కంటే వాటాలను తగ్గించుకోబోమని ఎన్డీఏ ప్రభుత్వం 2013 డిసెంబర్ 8న హామీ ఇచ్చింది. పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని కేంద్రం ఐడీబీఐ బిల్లు 2002లోనూ చేర్చింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీనే ఎన్డీఏ తుంగలో తొక్కుతుందని బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. 2016 నవంబర్ నోట్ల రద్దు తర్వాత ఐడిబిఐ బ్యాంక్ నష్టాల సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి కాపడటానికి 2018లో ఎల్ఐసితో దాదాపుగా 39 శాతం వాటాలను కొనుగోలు చేయించడంతో అప్పటికే 10 శాతం వాటాలున్న ఎల్ఐసికి ఇందులో 51 శాతం వాటాకు చేరింది. దీంతో 2019 జనవరి 21 నుంచి ఐడిబిఐ బ్యాంకును ప్రయివేటు రంగ బ్యాంకుల కేటగిరీలో చేర్చుతూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ బ్యాంక్ వ్యవహారాలను పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.