Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 మంది కోటీశ్వరులు : ఎడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : పంజాబ్‌లో ఆప్ నేతత్వంలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. కాగా, నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. వీరిలో నలుగురిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని పేర్కొంది. ఈ 11 మందిలో ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ కూడా ఉన్నారు. మొత్తం 11 మంది అఫిడవిట్లను పరిశీలించిన పంజాబ్ ఎలక్షన్ వాచ్, ఎడీఆర్ నివేదిక రూపొందించింది. వీరిలో ఏడుగురు (64శాతం) తమపై క్రిమినల్ కేసులున్నాయనీ, నలుగురు (36 శాతం) మంది తీవ్ర నేరారోపలున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారని తెలిపింది. వీరిలో 9 మంది మంత్రులు కోటీశ్వరులు.
ఈ మంత్రుల సగటు ఆస్తి విలువ రూ. 2.87 కోట్లు. హౌసియాపూర్ ఎమ్మెల్యే భ్రమ్ శంకర్ అత్యధికంగా రూ. 8.56 కోట్ల ఆస్తులను కల్గి ఉండగా. బోహ నియోజకవర్గం నుండి ఎన్నికైన లాల్‌చంద్‌కు కేవలం రూ. 6.19 లక్షల ఆస్తులున్నాయి. అదేవిధంగా అప్పుల్లో కూడా భ్రమ్ శంకర్ (రూ. 1.08 కోట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. ఐదుగురు మంత్రులు 10 నుండి 12వ తరగతి మధ్య చదువుకోగా.. మిగిలిన వారు గ్రాడ్యుయేషన్, అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు. ఆరుగురు 31 నుంచి 50 ఏండ్లు కాగా, మిగిలిన ఐదుగురు 51-60 ఏళ్ల వయస్కులు.
పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ఆప్ సభ్యులు వీరే..
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ రాజ్యసభ ఎన్నికలపై దృష్టిసారించారు. ఏప్రిల్ 9తో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పంజాబ్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు జరుగుతాయని ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఐఐటీ ప్రొఫెసర్ సందీప్‌పాఠక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవచద్దాలను పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్టు ఆప్ ప్రకటించింది. దీంతో రానున్న రాజ్యసభ ఎన్నికల అనంతరం ఎగువ సభలో ఆప్ సభ్యుల బలం మూడు నుండి ఎనిమిదికి చేరనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని 117 స్థానాలకు గాను ఆప్ 92 స్థానాల్లో ఘన విజయం సాధించింది.
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కి యూత్ ఐకాన్‌గా దేశంలో మంచి పేరు ఉండటంతో రాజ్యసభ స్థానానికి ఆయన మంచి అభ్యర్థి అని ఆప్ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాకు చాలా సంవత్సరాలుగా పార్టీతో అనుబంధం ఉంది. పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైనప్పటి నుంచి రాఘవ్ చద్దా తన సత్తాను నిరూపించుకున్నారు.
అతను పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా పనిచేశారు. చద్దా ఢిల్లీ నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ రాజ్యసభకు ఆయనను పంపించాలని ఆప్ నాయకత్వం భావిస్తోంది. ఆప్ ఢిల్లీ నుండి పార్టీ సీనియర్ నాయకుడు సంజరు సింగ్‌కు ఒక సీటు ఇచ్చింది.